ఆసియా పసిఫిక్ రైడ్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న త్రిలోక్ కొత్తపల్లి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
క్యాన్సర్ పరిశోధన, రోగుల సంరక్షణ కోసం ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రికి మద్దతుగా నిధులు సేకరించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమంలో గీతం పూర్వ విద్యార్థి పాల్గొని, తనవంతు చేయూతను అందిస్తున్నారు. ఇందుకోసం నిర్వహిస్తున్న అంతర్జాతీయ సైక్లింగ్ కార్యక్రమం సీ2సీ4సీ (కాంటినెంట్ 2 కాంటినెంట్ 4 క్యాన్సర్) ఆసియా ఫసిఫిక్ రైడ్ లో త్రిలోక్ కొత్తపల్లి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ నేతృత్వంలో, యూనియన్ ఫర్ ఇంటర్నేషన్ క్యాన్సర్ కంట్రోల్ (యూఐసీసీ) మద్దతుతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.15 రోజుల పాటు, దాదాపు 1800 కిలోమీటర్ల ఈ సైక్లింగ్ రిలేలో ఆస్ట్రేలియా, చైనా, భారతదేశం, జపాన్, సింగపూర్, అమెరికా వంటి ఆరు దేశాల నుంచి 55 మందికి పైగా రైడర్లు ఐదు జట్లుగా పాల్గొంటున్నారు. వీరు 2026 అక్టోబరు 6 నుంచి 20 వరకు జపాన్ లో సైకిల్ యాత్ర చేస్తారు. అక్టోబరు 12-14 తేదీలలో నగానాలోని ఉయెడా నుంచి గిఫు వరకు సైకిల్ యాత్ర చేసే మూడో బృందంలో త్రిలోక్ పాల్గొంటున్నారు.
త్రిలోక్, గీతంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తిచేశాక, కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ లో మాస్టర్స్ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ లో పనిచేస్తున్నారు. తన వృత్తి జీవితంతో పాటు ఆయనకు ఎండ్యూరెన్స్ (ఓర్పును పరీక్షించే) క్రీడలపై మక్కువ పెరిగింది. తన తొలి పరుగు అనుభవాల నుంచి సుదూర పరుగు, సైక్లింగ్ సవాళ్ల వరకు త్రిలోక్ క్రమంగా పురోగమిస్తున్నారు.‘‘నాకు, ఈ రైడ్ నేను సైకిల్ తొక్కే దూరం గురించి కాదు, ఆ దూరం దేనికి ప్రతీకగా నిలుస్తుందనే దాని గురించి. క్యాన్సర్ నా సొంత కుటుంబాన్ని కూడా తాకింది. రోగులు, వారి కుటుంబాలు మోసే అనిశ్చితి, దృఢత్వం, ఆశను నేను చూశాను. నాకంటే చాలా పెద్దదైన ఒక ఆశయానికి తోడ్పడటానికి నేను ఎండ్యూరెన్స్ క్రీడలను ఉపయోగించాలనుకున్నాను’’ అని త్రిలోక్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, త్రిలోక్ వ్యక్తిగతంగా లక్ష రూపాయల నిధులను సేకరించి, తన నిబద్ధతను చాటుకున్నారు. భారతీయ సీ2సీ4సీ రైడర్ బృందం సమిష్టిగా దాదాపు 12 లక్షల రూపాయలను సేకరించింది. ఈ నిధులు క్యాన్సర్ పరిశోధన, రోగుల సంరక్షణ కోసం ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రికి అందజేస్తారు.ఈ క్రీడలలో పాల్గొనడం ద్వారా తన విద్యా ప్రస్థానాన్ని, వృత్తిపరమైన అనుభవాన్ని, ఓర్పుతో కూడిన క్రీడల ద్వారా పొందిన వ్యక్తిగత పరివర్తనను త్రిలోక్ అలవరచుకోవడమే కాకుండా, తనకు వ్యక్తిగతంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఒక ఆశయానికి తోడ్పడే అవకాశాన్ని కూడా పొందుతున్నాడు.
