రామేశ్వరంబండ అభివృద్ధికి సంపూర్ణ సహకారం…
– అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
పటాన్ చెరు:
నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని రామేశ్వరంబండ గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఐక్యంగా గ్రామ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామంలో ఇప్పటికే ప్రతి కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, త్వరలో బచ్చు గూడెం చౌరస్తా నుండి గ్రామం వరకు రెండు లైన్ల బిటి రోడ్డు పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామ కూడళ్ళలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టినప్పుడే ప్రజల నమ్మకాన్ని సార్థకం చేసిన వాళ్లమవుతామని తెలిపారు. రామేశ్వరం బండ గ్రామ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ అంతి రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.