మీ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా
రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర సమావేశంలో పటాన్చెరు శాసనసభ్యులు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పల్లె నుండి పట్నం వరకు నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని పటాన్చెరు శాసన సభ్యులు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్ర కలిగిన రేషన్ డీలర్ల సంఘానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా తనను ఎన్నుకోవడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. ప్రకృతి విపత్తుల సంభవించిన, కరోనా లాంటి మహమ్మారి మూలంగా లక్షలాదిమంది చనిపోయిన సమయంలోనూ ప్రాణాలకు తెగించి ప్రజలకు నిత్యవసర వస్తువులు అందించడంలో రేషన్ డీలర్ల పాత్ర శ్లాగనీయమన్నారు. దశాబ్ద కాలంగా రేషన్ డీలర్లు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రేషన్ డీలర్లకు ఇచ్చిన ప్రధాన హామీల అమలుకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా ఐదు వేల రూపాయల గౌరవ వేతనం, క్వింటాలకు 300 రూపాయల కమిషన్ అందించాలను కోరుతూ త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీలర్ల సంఘం అధ్యక్షులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని తెలిపారు. హామీల అమలు అనంతరం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రెండు లక్షల మందితో విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేస్తానని తెలిపారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు మాట్లాడుతూ రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు, ప్రతి రేషన్ డీలర్ కు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, ఎంఎల్ఎస్ పాయింటలో ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జిలు, కరణం సమయంలో మరణించిన రేషన్ డీలర్ల కుటుంబ సభ్యులకు తిరిగి రేషన్ దుకాణాలు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు కృష్ణమూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వంభర్, వివిధ జిల్లాల నుండి సుమారు పదివేల మంది రేషన్ డీలర్లు హాజరయ్యారు.