గీతమ్ లో పీహెచ్డీ ప్రవేశాలకు...
– జూన్ 15 న ‘ ఆర్ సెట్ ‘
పటాన్ చెరు:
గీతం డీమ్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ , సైన్స్ , మేనేజ్ మెంట్ , ఫార్మశీ , లా , వివిధ సామాజిక శాస్త్రాలలో పరిశోధనలు జరపాలనుకునే వారికి జూన్ 15 వ తేదీన రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( ఆర్ సెట్ ) నిర్వహిస్తున్నట్టు గీతం పరిశోధన , కన్సల్టెన్సీ సేవల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ రాజా ఫణి పప్పు తెలిపారు . మొత్తం 40 శాస్త్ర విభాగాలలో 2020-21 విద్యా సంవత్సరానికి నిర్వహిస్తున్న ‘ ఆర్ సెట్’కు దాదాపు రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని , అధికంగా ఇంజనీరింగ్ , సైన్స్ , మేనేజ్ మెంట్ విభాగాలకు దరఖాస్తులు అందినట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ( యూజీసీ ) నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు.
ఆన్‌లైన్ విధానంలో 140 మార్కులకు గాను నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్షలో 50 శాతం మార్కులు సాధించిన వారిని వ్యక్తిగత ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తామని తెలియజేశారు . ఇంటర్వ్యూ 60 మార్కులకు ఉంటుందన్నారు . ఆన్లైన్ పరీక్షలో సాధించిన మార్కులు , వ్యక్తిగత ఇంటర్వ్యూలో అభ్యర్థి కనబరిచే ప్రతిభ ఆధారంగా పీహెచ్ డీలో ప్రవేశం కల్పిస్తామని రాజా తెలిపారు . మంగళవారం జరగనున్న ప్రవేశ పరీక్ష రెండు గంటల కాల వ్యవధి ఉంటుందని , దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అభ్యర్థులకు పంపామన్నారు . ఫలితాలను ఒక్క రోజులోనే వెల్లడిస్తామని డైరెక్టర్ తెలియజేశారు .
