పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తొలి బ్యాచ్ విద్యార్థులకు (2018-23 విద్యా సంవత్సరం) బుధవారం వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ ఐదేళ్లలో ఎంతో ఉద్విగ్నభరిత, ఉత్సాహపూరిత క్షణాలను గుర్తుచేసుకోవడానికి, స్నేహితులు, ఉపాధ్యాయులు, జూనియర్లతో వారు గడిపిన సమయాన్ని మననం చేసుకోవడానికి ఈ వీడ్కోలు వేదిక తోడ్పడింది.కిన్నెర సెమినార్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమం, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ సునీల్కుమార్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమైంది. తాము నిర్వహించిన విభిన్న కార్యక్రమాలు, వర్క్షాప్లోలో పాల్గొని, పరిపూర్ణతను పెంపొందించుకున్న విద్యార్థులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ‘ప్రయత్నించు, సేవ చేయి, వృ ద్ధిచెందు’ అనే గీతం నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి, బయటి ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చివరి ఏడాది విద్యార్థులకు ఆయన ఉద్బోధించారు.ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు, విద్య పూర్తిచేసుకుని బయటకు వెళుతున్న విద్యార్థులను అభినందించారు. చిత్తశుద్ధితో శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చన్నారు.ఆటపాటలు, సినీగీతాలకు తగిన లయబద్ధ నృత్యాలు, పాటలు, స్కిట్లతో సీనియర్లకు జూనియర్ విద్యార్థులు వీడ్కోలు పలికారు. ఐదేళ్ల తమ అనుభవాలను ఈ వేదిక నుంచి సీనియర్లు పంచుకోవడంతో పాటు ఆపాత మధురాలను గుర్తుచేసుకున్నారు.