_పాదయాత్రతో ఎన్నికల సమర శంఖం…
_తొలి రోజు గడపగడపకు నీలం మధుకు అపూర్వ స్వాగతం
_అహంకారానికి,ఆత్మగౌరవానికి మధ్య పోరులో నా పక్షాన నిలబడండి
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఎన్నికల సంగ్రామంలో తనకు జరిగిన అన్యాయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి ఆశీస్సులు తీసుకుంటానని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానని వెల్లడించిన నీలం మధు ముదిరాజ్ సోమవారం నుంచి పాదయాత్రతో ఎన్నికల సమరశంకాన్ని పూరించారు.గుమ్మడిదల మండలం కొత్తపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మీ కొడుకు మీ ఇంటి గుమ్మంలో నినాదంతో పాదయాత్రను ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో 65 లక్షల మంది జనాభా ఉన్న ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గంలో ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ మా జాతిని తీవ్రంగా అవమానించిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించినప్పుడే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు.
పటాన్ చెరు గడ్డ మీద ఈసారి ఎన్నికల్లో ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య పోటీ జరగనుందని తెలిపారు .పటాన్ చెరు నియోజకవర్గంలో తాను నిర్వహించిన సేవా కార్యక్రమాలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు తాను చేస్తున్న సేవలను చూసి ఓర్వలేక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అడుగడుగునా తీవ్ర అడ్డంకులకు గురి చేశాడని ఆరోపించారు. కనీసం కిందిస్థాయి కార్యకర్తలకు ప్రజలకు గౌరవం ఇవ్వలేని నాయకుడు మనకు అవసరమా అని ప్రజలను ప్రశ్నించాడు. గత పది ఏళ్లలో ఎమ్మెల్యేకు గుర్తురాని ప్రజలు గత నాలుగేళ్లుగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు తనకొస్తున్న గుర్తింపు చూసి నిద్రలేచి ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. అయితే గత పదేండ్లలో ఎన్నో అవమానాలు, అణిచివేతలు అక్రమాలను చూసిన ప్రజలు, కిందిస్థాయి కార్యకర్తలు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారని తెలిపారు. ప్రజలే దేవులుగా ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా తాను పాదయాత్రకు ప్రజల్లోకి వెళ్తున్ననన్నారు.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విజయం సాధిస్తే కేవలం ఆయన కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా గౌరవం పొందుతారని, కానీ తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న మూడు లక్షల 80 వేల మందికి ఎమ్మెల్యేలుగా గుర్తింపు తెస్తానన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే ‘గుడ్ మార్నింగ్ పటాన్ చెరు’ కార్యక్రమాన్ని మొదలుపెట్టి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.
అనంతరం కొత్తపల్లి గ్రామంలో పాదయాత్ర మొదలుపెట్టిన నీలం మధు ముదిరాజ్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. తమ గడపకు వచ్చిన నీలం మధు ను తమ ఇంట్లో బిడ్డగా ఆదరించి తమ కష్టాలను చెప్పుకున్నారు. తమ కుటుంబ సభ్యుడు లాంటి నీలంకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తామండగా నిలబడి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రజలు స్పష్టం చేశారు.
తాను ఎమ్మెల్యేగా గెలిస్తే చేసే అభివృద్ధిని వివరిస్తూ ఐదు హామీలతో పోస్టర్ ను విడుదల చేశారు.మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యా, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి అవకాశాల కల్పన, పర్యావరణ పరిరక్షణ, స్థానిక పాలనలో ప్రజల భాగస్వామ్యం అనే అంశాలకు ప్రాధాన్యమిస్తానన్నారు.ప్రజలు ఆత్మగౌరవంతో ఆలోచించి మీ కుటుంబ సభ్యుడిగా మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వస్తున్న నన్ను ఆదరించి ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు,ప్రజలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు