ఔషధ పరిశోధనా కాలాన్ని తగ్గించాలి…
– అంతర్జాతీయ సదస్సులో నిపుణులు
హైదరాబాద్:
కోవిడ్ వ్యాక్సితో పాటు వివిధ రుగ్మతల నివారణకు నూతన ఔషధాలను వినియోగంలోకి తీసుకురావడానికి పట్టే కాలాన్ని తగ్గించాల్సి ఆవశ్యకత ఉందని పలువురు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు.
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో రసాయనిక, జీవ, పర్యావరణ శాస్త్రాలలో అభివృద్ధి పై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఈ సదస్సులో మలేసియాలోని యూసీఎన్ఏ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ షేక్ ఇబ్రహీం మాట్లాడుతూ వివిధ రోగాలకు ఔషధాలను అన్వేషించడం, క్లినికల్ పరీక్షలు, ఎడీపీ అనుమతులు, మార్కెటింగ్ వంటి పనులను పూర్తిచేయడానికి దాదాపు 12 నుంచి 24 సంవత్సరాల సమయం పడుతోందన్నారు.
ఈ కాలాన్ని తగ్గించడానికి వివిధ ఔషధ పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల నిపుణులు కలిసి కృషిచేస్తున్నట్టు ఆయన తెలిపారు. వివిధ వృక్ష జాతులు, వివిధ రకాల సూక్ష్మజీవులు, సముద్ర జీవాలు, జంతువుల నుంచి ఔషధ మూలాన్ని గుర్తించడం, వాటిని వేరుచేయడం, శుద్ధి చేయడం, ఔషధ గుణాలను విశ్లేషిచడం వరకు రసాయనిక శాస్త్ర నిపుణులే కీలక భూమిక పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
వీటితోపాటు ఔషధ చట్టాలు, క్లినికల్ మెడిసిన్, పోటీ ఔషధాల అధునాతన పరిశోధనా విధానాలపై రసాయనిక నిపుణులకు లోతైన అవగాహన ఉంటే త్వరితగతిన నూతన ఔషధాలను వెలుగులోకి తేవచ్చునని ఇబ్రహీం అభిప్రాయపడ్డారు. అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయం పరిశోధకుడు స్కాట్ ఎ.స్పైడర్ మాట్లాడుతూ ప్రకృతిలోని శిలీంద్రాలు, సూక్ష్మజీవులు, సముద్ర జీవరాశుల నుంచి తన పరిశోధనా బృందం సరికొత్త ఔషధ గుణాలు గల మూలకాలను గుర్తించిందన్నారు.
వాటి వినియోగానికి పరిశ్రమలతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. బ్రిటన్‌లోని అబర్డీన్ విశ్వవిద్యాలయం కింగ్స్ కళాశాల జీవశాస్త్ర విభాగం ప్రొఫెసర్ డేవిడ్ డయనోసి మాట్లాడుతూ పరిశ్రమలు, పట్టణ వ్యర్థాలను వివిధ జీవ ప్రక్రియల ద్వారా శుద్ధిచేసి విద్యుత్ ఉత్పాదనకు మళ్ళిండంపై తాము అధ్యయనం జరుపుతున్నామన్నారు. వ్యర్థ జలాల నుంచి వివిధ రసాయనాలను ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. అమెరికాలోని యంగ్స్టన్ విశ్వవిద్యాలయం రసాయన, జీవశాస్త్ర విభాగం ప్రొఫెసర్ మిలికా జీవాక్ మాట్లాడుతూ శిలాజ ఇంధన వనరులు అడుగంటుతున్న ప్రస్తుత తరుణంలో ప్రత్యామ్నాయంగా పట్టణ వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చని, దానిపై తమ బృందం పరిశోధిస్తోందన్నారు. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన పలువురు పరిశోధకులు, శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో పలువురు పరిశోధనా పత్రాలను సమర్పించారు. వాటిని సభికులకు వివరించడంతో పాటు వారడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. అత్యుత్తమ మౌఖిక ప్రదర్శన, అత్యుత్తమ పోస్టర్లకు ప్రత్యేక ప్రశంసా పత్రాలను ఇచ్చి ఉత్సాహపరిచారు. ముగింపు ఉత్సవంలో స్కూల్ సైన్స్ ప్రిన్సిపాళ్ళు ప్రొఫెసర్ జీఏ రామారావు, ప్రొఫెసర్ ఎం.శరత్ చంద్రబాబు, నిర్వాహకులు డాక్టర్ రత్నమాల, డాక్టర్ వందన తదితరులు పాల్గొన్నారు.