_ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శరత్ కుమార్, ఎస్పీ రమణ కుమార్
మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నేడు పటాన్చెరు పట్టణంలో నిర్వహించనున్న ర్యాలీ ఏర్పాట్లను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, ఎస్పి రమణ కుమార్ లు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు.నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే జిఎంఆర్ వారికి తెలిపారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిదులతో కలిసి రెండు సార్లు సమీక్ష సమావేశాలు పూర్తి చేసామని పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారికి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, జిహెచ్ఎంసి అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ర్యాలీ అనంతరం అందరికీ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ర్యాలీ నిర్వహించే రూట్ మ్యాప్ తో పాటు భోజనం ఏర్పాటు చేయనున్న ఫంక్షన్ హాల్ లను వారు స్వయంగా పరిశీలించారు. ర్యాలీ సందర్భంగా చేస్తున్న ఏర్పాట్ల పట్ల కలెక్టర్, ఎస్పీ సంతోషం వ్యక్తం చేశారు.పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్వహించే ప్రతి కార్యక్రమం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోందని వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, డీఎస్పీ భీమ్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.