ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కోరిన అఖిలపక్ష బృందం నాయకులు
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పాత అమీన్పూర్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామాల అఖిలపక్ష బృంద సభ్యులు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమీన్పూర్ పేరుతో కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, సుల్తాన్పూర్, జానకంపేట, దాయర, ఐలాపూర్, ఐలాపూర్ తాండ, వడకపల్లి గ్రామాలతో కలిసి మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో విలీనం చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమీన్పూర్ మున్సిపాలిటీనీ జిహెచ్ఎంసి లో విలీనం చేయడంతో పాటు బీరంగూడ, అమీన్పూర్ కేంద్రాలుగా రెండు డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విభజనలో అమీన్పూర్ మండలానికి తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఎమ్మెల్యేకు విన్నవించారు. 8 గ్రామాల పరిధిలో 60 వేలకు పైగా జనాభాతో పాటు సుల్తాన్పూర్ ఇండస్ట్రియల్ పార్క తో పాటు 40 వేలకు పైగా ఓటర్లు ఉన్నారని వారు తెలిపారు. పరిపాలన సౌలభ్యం, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించాలని వారు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి నూతన డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు ఈర్ల రాజు, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ సర్పంచులు కృష్ణ , శ్రీకాంత్, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
