సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డిని కోరిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
నియోజకవర్గ కేంద్రమైన పటాన్‌చెరు డివిజన్ పరిధిలో పరిపాలన సౌలభ్యం, ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన ఏసిపి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డిని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.సోమవారం ఉదయం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ రమేష్ రెడ్డితో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొంది శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు నియోజకవర్గంలో నూతనంగా చేపడుతున్న పోలీస్ స్టేషన్ల విభజన ప్రక్రియను ప్రజల అవసరాలకు, అభిప్రాయాలకు అనుగుణంగా చేపట్టాలని ఇప్పటికే డిజిపి శివధర్ రెడ్డికి సైతం విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ప్రధానంగా పటాన్‌చెరు నియోజకవర్గ కేంద్రంగా పనిచేయాల్సిన ఏసిపి కార్యాలయాన్ని ఆర్సీపురం పేరుతో ఆర్ సి పురం కేంద్రంగా ఏర్పాటు చేశారని దీని మూలంగా స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. పటాన్‌చెరు పట్టణంలో జాతీయ రహదారికి అనుకొని ప్రజలందరికీ అనువుగా అధునాతన సౌకర్యాలతో ఇటీవల 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో డీఎస్పీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని పనులు సైతం ప్రారంభమయ్యాయని తెలిపారు. నూతన భవనంలో పటాన్‌చెరు పేరుతో ఏసిపి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ ను నార్సింగి ఏసిపి కార్యాలయం పరిధిలోకి చేర్చారని రామచంద్రపురం ఏసిపి పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్ కి బదులుగా కొల్లూరు పోలీస్ స్టేషన్ ను చేర్చాలని కోరారు. దీని మూలంగా పరిపాలనా పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు. పటాన్‌చెరు కేంద్రంగా పనిచేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ విభజన ప్రక్రియలో ఇస్నాపూర్ పరిధిలోకి వెళ్లడం జరిగిందని.. పటాన్చెరు కేంద్రంగా నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ రమేష్ రెడ్డి త్వరలోనే ఇందుకు సంబంధించి సానుకూల నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.
