– ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన పోలీస్ స్టేషన్లు, సబ్ డివిజన్లు ఏర్పాటు చేయండి
-డిజిపి శివధర్ రెడ్డిని కోరిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొంది.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నియోజకవర్గంలో నూతనంగా చేపడుతున్న పోలీస్ స్టేషన్ల విభజన ప్రక్రియను ప్రజల అవసరాలకు, అభిప్రాయాలకు అనుగుణంగా చేపట్టాలని కోరుతూ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డిని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం హైదరాబాదులోని డీజీపీ కార్యాలయంలో డిజిపి శివధర్ రెడ్డితో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను డిజిపి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా పటాన్ చెరు నియోజకవర్గ కేంద్రంగా పనిచేయాల్సిన ఏసిపి కార్యాలయాన్ని.. ఆర్సీపురం పేరుతో ఆర్ సి పురం కేంద్రంగా ఏర్పాటు చేశారని దీని మూలంగా స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. పటాన్ చెరు పట్టణంలో జాతీయ రహదారికి అనుకొని ప్రజలందరికీ అనువుగా అధునాతన సౌకర్యాలతో ఇటీవల 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో డీఎస్పీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని పనులు సైతం ప్రారంభమయ్యాయని తెలిపారు. నూతన భవనంలో పటాన్ చెరు పేరుతో ఏసిపి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ ను నార్సింగి ఏసిపి కార్యాలయం పరిధిలోకి చేర్చారని రామచంద్రపురం ఏసిపి పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్ కి బదులుగా కొల్లూరు పోలీస్ స్టేషన్ ను చేర్చాలని కోరారు. దీని మూలంగా పరిపాలనా పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు. మినీ ఇండియా గా పేరుందిన బొల్లారం పోలీస్ సర్కిల్ కార్యాలయం తో పాటు పోలీస్ స్టేషన్ ను రద్దు చేసి బొల్లారం డివిజన్ ను పూర్తిగా అమీన్పూర్ పోలీస్ సర్కిల్ పరిధిలోకి చేర్చారని దీని మూలంగా స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఏర్పడబోతున్నాయని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల సైతం బొల్లారం పరిధిలో పనిచేస్తున్నాయని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.
ఇప్పటికే బొల్లారం పరిధిలో 17వేల చదరపు అడుగుల సామర్థ్యంతో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులు సైతం కొనసాగుతున్నాయని తెలిపారు. బొల్లారం పరిధిలోని పోలీస్ స్టేషన్ ను యధావిధిగా కొనసాగించాలని కోరారు. పటాన్ చెరు కేంద్రంగా పనిచేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ విభజన ప్రక్రియలో ఇస్నాపూర్ పరిధిలోకి వెళ్లడం జరిగిందని పటాన్ చెరు కేంద్రంగా నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి త్వరలోనే ఇందుకు సంబంధించి సానుకూల నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.
