వికారాబాద్ ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎల్లకొండ శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. శివరాత్రి పండుగ రోజున ప్రారంభమయిన ఈ ఉత్సవాలు మార్చి 12 వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులు పళ్ళ భరత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ,ఏపీతో పాటు కర్నాటక ,మహారాష్ట్రల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు .మహాశివరాత్రి రోజున స్వామి వారి రుద్రాభిషేకములు, అమ్మవారికి అర్చనలు, ధ్వజారోహణము, అఖండ దీపారాధన, రాత్రికి జాగరణ, భజన కార్యక్రమాలు నిర్వహించారు .అష్టమి స్వామివారికి, అమ్మవారికి నిత్యార్చనలు, విశేషపూజలు అందిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
08-03-2025 శనివారం ,09-03-2025 ఆదివారం,10-03-2025 సోమవారం,11-03-2025 మంగళవారం,12-03-2025 బుధవారం సప్తమి స్వామివారికి అభిషేకములు శివ సహస్రనామార్చన, కుంకుమార్చన , శేషవాహనసేవలు కొనసాగుతున్నాయని తెలిపారు .నవమి రోజు 4.00 గంటలకు పల్లకిసేవ ఉదయం ఆరు గంటలకు అగ్నిగుండ మహోత్సవం ,ఉదయం 8 గంటలకు అభిషేకం అమ్మవారికి విశేష అర్చన 11 గంటలనుండి పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు .దశమీ ఉదయం 8 గంటల నుండి ప్రత్యేక అభిషేకములు, అర్చనలు సాయంత్రం ఆరు గంటలకు కలశరోహణము తెల్లవారు ఝామున ఉదయం నాలుగు గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు .ద్వాదశి రోజున నిండు జాతర , త్రయోదశి రోజున నాగవెల్లి నిర్వహిస్తున్నామని భక్తులు ఈ ఉత్సవ కార్యక్రమాల్లో భక్తి శ్రద్దలతో పాల్గొనాలన్నారు.బ్రహ్మోత్సవాల నిర్వహణలో తమ వంతుగా వస్తు రూపేణ సహాయ సహకారాలను అందించి శ్రీ పార్వతీ పరమేవశ్వరులను దర్శించి తరించి వారి కృపకు పాత్రులు కాగలరని ప్రధాన అర్చకులు మడుపతి నాగేశ్వరయ్య స్వామి తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు .