ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఎన్ఐటీ పూర్వ డీన్ ప్రొఫెసర్ కట్టా వెంకటరమణ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
భూకంపాలను తట్టుకునేలా భవనాలను రూపొందించేందుకు అత్యాధునిక పరిజ్జానం, వినూత్న పద్ధతులు అందుబాటులో ఉన్నాయని ఎన్ఐటీ సూరత్కల్ మాజీ డీన్ (విద్య) ప్రొఫెసర్ కట్టా వెంకటరమణ చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ఇంజనీరింగ్ భూకంప శాస్త్రం – గత భూకంపాల నుంచి నేర్చుకోవడం’ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.భూకంప నిరోధక భవన నిర్మాణ డిజైన్ కోసం బేస్ ఐసోలేషన్ టెక్నిక్, బ్రేసింగ్ సిస్టం వంటి పలు వినూత్న పద్ధతులు ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఎయిర్ బ్యాగ్ విధానంలో, భూకంపం వచ్చినప్పుడు భవనం కొద్దిగా పైకి లేచి, ప్రకంపనలు తగ్గిపోగానే యథాతథ స్థితికి వచ్చే అధునాతన సాంకేతిక పరిజ్జానం కూడా అందుబాటులో ఉందన్నారు. భూకంపాలు సహజంగా టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనడం వల్ల సంభవిస్తాయని, సీస్మోగ్రాఫ్ ద్వారా దాని తీవ్రతను కొలుస్తారని చెప్పారు. భూకంప సంఘటనలకు వ్యతిరేకంగా భద్రత, స్థితిస్థాపకతను పెంచడానికి అనుగుణంగా నిర్మాణాలను రూపొందించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, నిర్మాణ పద్ధతులు ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా అభివృద్ధి చెందాయని, అయితే అనేక భూకంప ప్రయోగాలు ఖరీదైనవి కావడంతో, అవి సంభవించినప్పుడు వివిధ దేశాల నిపుణులు క్షేత్ర ప్రయోగాల ద్వారా నష్టాన్ని అధ్యయనం చేయడమే గాక, డిజైన్ లోపాలను గుర్తించి, మెరుగైన ఇంజనీరింగ్ పద్ధతులను రూపొందిస్తారని వివరించారు. కుప్పకూలిపోకుండా ఊగగల, శక్తిని గ్రహించగల నిర్మాణాలను రూపొందించడం చాలా అవసరమని డాక్టర్ కట్టా స్పష్టీకరించారు. వంగే గుణము, ఉపబలం సూత్రాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా, ప్రకృతి శక్తులను తట్టుకునే భవనాలను మనం సృష్టించవచ్చని, అందులో నివాసం ఉండేవారికి తగిన భద్రత కల్పించవచ్చని అన్నారు.
కాన్పూర్ ఐఐటీ వెబ్ సైట్, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ (ఎన్ఐసీఈఈ) వంటి వాటిని తరచూ సంప్రదించడం ద్వారా పలు ప్రాజెక్టులు, పరిశోధనలు చేపట్టే వీలుందంటూ ప్రొఫెసర్ వెంకటరమణ విద్యార్థులను ప్రోత్సహించారు. వారడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు.సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ చేపూరి అఖిలేష్ అతిథిని విద్యార్థులకు పరిచయం చేసి, ఆయన విలువైన సమయాన్ని కేటాయించినందుకు కృతజ్జతలు తెలియజేశారు.