కౌటిల్యాలో దువ్వూరి పుస్తకావిష్కరణ

Lifestyle Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ బుధవారం డాక్టర్ దువ్వూరి సుబ్బారావు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. పూర్వ భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్, కౌటిల్యాలోని విశిష్ట విజిటింగ్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ సుబ్బారావు ‘జస్ట్ ఎ మెర్సెనరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకాన్ని రచించారు. డాక్టర్ సుబ్బారావు ఐదేళ్ల (2008-13) పాటు భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ గా పనిచేశారు. అంతకు ముందు, ఆయన భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా (2007-08), ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (2005-07) కార్యదర్శి వంటి గౌరవనీయమైన పదవులను నిర్వహించారు. ఈ పుస్తకం డాక్టర్ సుబ్బారావు అసాధారణ కెరీర్ కు సంబంధించిన ఆకర్షణీయమైన, శ్రద్ధాసక్తులతో కూడిన కథనాన్ని అందించడమే గాక, యువ నిపుణులకు వారి సొంత వృత్తిలో రాణించడానికి మార్గనిర్దేశనం చేసేలా, యువతను ప్రేరేపించేలా ఉంది. వివిధ శాఖలలో పలు హోదాలలో ఆయన చేసిన సుదీర్ఘ ప్రయాణం నుంచి పాఠాలు నేర్చుకోవడంతో పాటు ప్రారంభ జిల్లా-స్థాయి నియామకాల నుంచి భారతదేశ బ్యూరోక్రాటిక్ ఫ్రేమ్ వర్క్ వరకు జరిగిన పరిణామ క్రమం, పౌర సేవల్లో లింగ సమానత్వం వంటి పలు ఆసక్తికర అంశాలను సృజిస్తూ సాగింది.

చివరగా, తన తల్లికి రాసిన లేఖను ఈ పుస్తకంలో అచ్చు వేయడంతో పాటు, దానిని డాక్టర్ సుబ్బారావు స్వయంగా చదివి వినిపించడం అందరినీ కదిలింపజేసింది.రచయిత డాక్టర్ సుబ్బారావుతో సంభాషణనను కౌటిల్యాలోని విజిటింగ్ ఫ్యాకల్టీ, ఇండిపెండెంట్, ముల్టీమీడియా జర్నలిస్టు స్మితా శర్మ నేర్పుగా నిర్వహించగా, కౌటిల్యా ప్రోగ్రామ్ మేనేజర్ శివంగి శర్మ వందన సమర్పణ చేశారు.ఈ కార్యక్రమంలో కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్ సయ్యద్ అక్బరుద్దీన్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సుబ్బారావుని అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *