గీతంలో ఘనంగా దివ్వెల వేడుక

Telangana

రంగోలి పోటీ, హలోవీన్-ను కూడా నిర్వహించిన విద్యార్థులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరబాదులోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం దీపోత్సవం పేరిట దీపావళి వేడుకను ఉల్లాసభరితంగా, సృజనాత్మకతను చాటేలా నిర్వహించారు.సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ప్రాంగణం లెక్కలేనన్ని దీపాల వెలుగుతో ప్రకాశించి, చీకటిపై కాంతి, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచింది. గీతం, హైదరాబాదు ప్రాంగణమంతటా ప్రతిధ్వనించే సానుకూల శక్తి, పండుగ ఉల్లాసాన్ని స్వాగతిస్తూ, దీపాల అద్భుత శక్తిని విద్యార్థులంతా కలిసి స్వీకరించారు.దీనికి ముందు, పర్యావరణ అనుకూలమైన దీపాలకు రంగులు వేయడం ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మకతను వ్యక్తీకరించడమే గాక, పరిసరాలను రంగులమయం చేశారు. ఈ వేడుకకు రంగోలి పోటీ జతకలిసి విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

విద్యార్థులు క్లిష్టమైన డిజైన్-లను ప్రదర్శించి, దీపావళి ఉత్సవాలలో అంతర్లీనంగా ఉన్న కళాత్మక స్ఫూర్తిని చాటిచెప్పారు.ఈ ఆహ్లాదకరమైన సంస్కృతుల కలయికలో, ‘స్పార్క్స్ అండ్ స్పిరిట్స్’ పేరిట హలోవీన్-ను కూడా గీతం విద్యార్థులు నిర్వహించారు. భోగి మంటలు వెలిగించి, దెయ్యాలను పారద్రోలేందుకు సృజనాత్మక దుస్తులను ధరించి, ఈ భయానక వేడుకలో పాల్గొన్నారు. దీపావళి, హలోవీన్ ఉత్సవాల ఈ ప్రత్యేక సమ్మేళనం విద్యార్థులలో ఆనందాన్ని పెంపొందించి, విభిన్న అనుభవాలను కలిగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *