పటాన్ చెరు:
రుద్రారంలోని రెండు ప్రాథమిక ఉన్నత పాఠశాలలతో సహా ఇంద్రకరణ్ , కలివేముల , మామిడిపల్లిలోని ఉన్నత పాఠశాలల్లో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శుక్రవారం 2,400 నోట్‌బుక్స్ , 1,200 పెన్నులు , పెన్సిళ్ళు , పెన్పెన్సిళ్ళు , రబ్బర్లు , షార్పనర్లు , స్కేళ్ళను పంపిణీ చేసింది . గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ నేతృత్వంలో , ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్స్ సౌజన్యంతో , 2013 నుంచి ఆయా పాఠశాలల్లో గీతం నోట్‌బుక్స్ పంపిణీ చేస్తున్న విషయం విదితమే . క్లాస్మేట్ నోట్‌బుక్స్ , స్టేషనరీ సామగ్రిని తమ చిట్టి చేతుల్లో పట్టుకుని ఆయా పాఠశాలల విద్యార్థులు ఫోటోలకు ఫోజులివ్వడంతో పాటు కొత్త వాటిని ఉత్సుకతతో పరికించడం కనిపించింది .గీతం వర్సిటీ యాజమాన్యం , విద్యార్థుల ఉదారతను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బహుదా ప్రశంసించారు .
వినియోగించిన కాగితం పునర్ వినియోగం ప్రాముఖ్యత , విలువైన సహజ వనరుల సంరక్షణ , వ్యర్థాల పునరుత్పత్తి వంటి అంశాలను ఐటీసీ ప్రతినిధులు ఫిరోజ్ మున్షీ , మాలతీలు వివరించారు . ఈ వితరణ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ బాలసిద్ధులు , గీతం హాస్పిటాలిటీ జనరల్ మేనేజర్ మారియో చెరిమెన్ , ఎగ్జిక్యూటివ్ జె.మీనా , ఐటీసీ ప్రతినిధులు , పలువురు విద్యార్థులు పాల్గొన్నారు .