విభిన్న యోచనే విజయానికి తొలి మెట్టు

Telangana

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో నోవార్టీస్ డైరెక్టర్ డాక్టర్ సుబాస్ చంద్ర మహాపాత్ర

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మనకు సౌకర్యంగా ఉన్న వాతావరణం నుంచి బయటకు వచ్చి విభిన్నంగా ఆలోచించాలని, అదే మన విజయానికి తొలి మెట్టుగా నోవార్టీస్ డైరెక్టర్ డాక్టర్ సుబాస్ చంద్ర మహాపాత్ర అభివర్ణించారు. గీతం డీమ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని కెరీర్ గైడెన్స్ సెంటర్ (సీజీసీ) ఆధ్వర్యంలో ‘ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో ఆధునిక ధోరణులు” అనే అంశంపై శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. స్కూల్ ఆఫ్ ఫార్మసీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఆరోగ్య పరిరక్షణ పురోగతిని విశదీకరించారు.వైద్య పరికరాలు, జీవశాస్త్రం, న్యూక్లియర్ మెడిసిన్, సెల్-జీన్ థెరఫీ, వ్యక్తిగత వైద్యం వంటి అనేక అభివృద్ధి చెందుతున్న రంగాలను ప్రస్తావించారు.

భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణలో ఈ రంగాలు పోషించే కీలక పాత్రలను వివరించారు. వైద్య పరికరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని, పరిశ్రమలో బయోలాజిక్స్ కీలకం కానుందని, న్యూక్లియర్ మెడిసిన్ కొత్త పుంతలు తొక్కుతోందని, సెల్-జీన్ థెరపీ చికిత్సా విధానాలను విప్లవాత్మకంగా మారుస్తున్నాయన్నారు. అంతే కాకుండా, వ్యక్తిగత రోగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా చికిత్సను రూపొందించే వ్యక్తిగతీకరించిన ఔషధాలు కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయని, ఇవన్నీ ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును రూపొందిస్తున్నాయని డాక్టర్ మహాపాత్ర అన్నారు. డిజిటల్ ఆరోగ్యం, ఔషధ పరిశ్రమలో ఇటీవలి పురోగతిలో కత్రిమ మేథ (ఏఐ) పాత్ర గురించి కూడా డాక్టర్ సుబాస్ చర్చించారు. పరిశోధన, అభివృద్ధి, వాణిజ్యీకరణ వంటి రంగాలలో ఆయా విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఒక రంగాన్ని ఎంపిక చేసుకుని రాణించాలని సూచించారు.

ఫార్మా పరిశ్రమలో బహుముఖ అంతర్ విభాగ పరిజ్ఞానం ఆవశ్యకతను నొక్కి చెబుతూ, ఐటీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఒక వ్యక్తికి మార్గదర్శి ప్రాముఖ్యతను వివరిస్తూ, ఈ ప్రపంచంలో సమస్త విషయాలూ తెలిసినవారు ఎవరూ ఉండరని, మనకొచ్చే సందేహాల నివత్తి కోసం ఒక మార్గదర్శి ఉండడం చాలా కీలకమని చెప్పారు. విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణంగా ఒక రంగాన్ని ఎంపిక చేసుకుని, అందులో అత్యుత్తమ నైపుణ్యం సాధించడంపై దృష్టి పెట్టాలని డాక్టర్ మహాపాత్ర సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా జవాబులిచ్చి, విభిన్న కెరీర్ అవకాశాలను అన్వేషించేలా వారిని ప్రేరేపించారు. తొలుత, స్కూల్ ఆఫ్ ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బప్పాదిత్య ఛటర్జీ అతిథిని స్వాగతించగా, డాక్టర్ రామకంట బాల్ డైరెక్టర్ కెరియర్ గైడెన్స్ సెంటర్ వందన సమర్పణ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *