– ఒకే రోజు 23 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం
రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి :
నూతనంగా ఏర్పడిన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో 23 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ శంకుస్థాపన చేశారు. మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే జీఎంఆర్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నారాయణఖేడ్ సభలో ప్రకటించిన 25 కోట్ల రూపాయల నిధులతోమున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న తెల్లాపూర్ మున్సిపల్ అన్ని రంగాల్లో దూసుకు వెళ్తోందని అన్నారు. ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.