దళితుల ఆర్థిక అభ్యున్నతికే దళిత బంధు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Districts politics Telangana

పటాన్చెరు నియోజకవర్గం నుండి వంద మంది లబ్ధిదారుల ఎంపిక

పటాన్ చెరు

బంగారు తెలంగాణలో దళితులందరూ ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం పెదకంజర్ల గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో పటాన్చెరు నియోజకవర్గ స్థాయి దళిత బంధు పథకం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని 100 కుటుంబాలను ఎంపిక చేసి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల యూనిట్లను అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు మండలం బచ్చుగూడెం, జిన్నారం మండలం కొడకంచి, గుమ్మడిదల మండలం అనంతారం గ్రామాల నుండి 100 దళిత కుటుంబాలను పారదర్శకంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు అందరూ ప్రతి పైసాను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు 27 శాఖల అధికారులు ఆయా అంశాలపై వివరంగా అవగాహన కల్పిస్తారని తెలిపారు. వారు సూచించిన అంశాల ఆధారంగా నచ్చిన వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరారు. పథకం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక దళిత బంధు విజయానికి ప్రతి ఒక్కరు సంపూర్ణంగా సహకరించాలని కోరారు. తాను 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, కలలో కూడా ఇలాంటి పథకం వస్తుందని ఊహించలేదని ఎమ్మెల్యే జిఎంఆర్ అన్నారు. కష్టపడి పనిచేసి సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. అవసరమైన పక్షంలో మరో మారు అవగాహన సదస్సు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి దళిత బంధు పథకం ఆవశ్యకతను లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ దళిత బంధు ప్రత్యేక అధికారి ప్రసాద్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి కుమార్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *