జ్జానాన్ని పెంచుకోవడం ఐచ్చికం కాదు, అవసరం

Telangana

జాతీయ కార్యశాల ప్రారంభోత్సవంలో స్పష్టీకరించిన హెచ్.సీ.యూ ప్రొఫెసర్ ఉద్గాట

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

జ్జానం నిరంతరం అభివృద్ధి చెందుతోందని, ఈ పరిణామ వేగం సంవత్సరాల నుంచి కేవలం రోజులకు చేరుకుందని, అందువల్ల మనని మనం నవీకరించుకోవడం ఇకపై ఐచ్చికం కాదు, అవసరం అని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సిబా ఉద్గాట స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, హైదరాబాదులోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘పెద్ద భాషా నమూనాలు, ఉత్పాదక కృత్రిమ మేధస్సు’ (LLMs and Generative AI) అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల కార్యశాల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించిన డాక్టర్ ఉద్గాట మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, సాంకేతికతలో వేగవంతమైన పురోగతి గురించి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మౌలిక అంశాలపై పట్టు సాధించడం తప్పనిసరి అయినప్పటికీ, పురోగతికి నిరంతర అభ్యాసం, విచారించే తత్త్వం అవసరమన్నారు.

ఆవిష్కరణలకు కీలకం ప్రశ్నించడంలో ఉంది, ఏదైనా ఎందుకు పనిచేస్తుందో, ప్రత్యామ్నాయాలు ఎందుకు ఉన్నాయో అర్థం చేసుకోవడం అవశ్యమని డాక్టర్ ఉద్గాట వ్యాఖ్యానించారు.ప్రారంభోత్సవంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ మౌనేంద్ర శంకర్ దేశర్కర్ మాట్లాడుతూ, గీతం ఇటువంటి ప్రభావవంతమైన వర్క్ షాపులను నిరంతరం నిర్వహిస్తున్నందుకు ప్రశంసించారు. ఇందులో పాల్గొంటున్న వారు కృత్రిమ మేధస్సుపై జరిగే పరిశోధన, ప్రయోగాలలో చురుకుగా పాల్గొనాలని ప్రోత్సహించారు.

‘ఇది సంక్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న రంగం. కృత్రిమ మేధస్సు మానవ ఆలోచన ప్రక్రియలను ఎలా అనుకరిస్తుందో అన్వేషించడం ద్వారా, గణనీయమైన మెరుగుదల, పురోగతిని సాధించగలం. ఈ భావనలను నిజంగా అర్థం చేసుకోవడానికి ఆచరణాత్మక అనుభవం కీలకం’ అని ఆయన పేర్కొన్నారు.కార్యశాల నిర్వాహకులు డాక్టర్ మోతాహర్ రెజా, ప్రొఫెసర్ బీ.ఎం. నాయుడు, గౌరవనీయ అతిథులను సాదరంగా స్వాగతించగా, సమన్వకర్తలు డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి, డాక్టర్ కె.కృష్ణ వందన సమర్పణ చేశారు. ఈ కార్యశాల నిపుణుల నేతృత్వంలో చర్చలు, ఆచరణాత్మక సెషన్ లు, సహకార అభ్యాసాలతో శుక్రవారం వరకు కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *