దుర్గం చెరువు వద్ద చార్ కోల్ కార్యశాల నిర్వహించిన గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రశాంతమైన ప్రకృతిలో మనస్సు ప్రశాంతంగా ఉండడమే గాక అటు భావుకతతో పాటు ఇటు సృజనాత్మకత పెల్లుబకడం సహజం. ఆ నేపథ్యాన్ని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తనకు అనుకూలంగా మలచుకుంటూ, దుర్గం చెరువు సమీపంలోని పచ్చని అందాలు, చల్లని మలయమారుతాల మధ్య ‘బ్లాంక్ కాన్వాస్ నుంచి మాస్టర్ పీస్ వరకు’ అనే ఇతివృత్తంతో ఒక కార్యశాల నిర్వహించింది. ఇందులో బాలల నుంచి వయోజనుల వరకు, అన్ని వయస్సుల వారు పాల్గొని, తమ సృజనాత్మకతకు పదును పెట్టారు.ఈ కార్యశాల ఉల్లాసభరితమైన, సృజనాత్మక వాతావరణంలో సాగింది. పెయింగ్ వేయడాన్ని నేర్చుకోవడం ఆరంభించిన వారి నుంచి అనుభవజ్జులైన కళాకారుల వరకు అందరూ తరలివచ్చి, చార్ కోల్ డ్రాయింగ్ పట్ల తమ ప్రేమను ప్రదర్శించారు. వారి ఉత్సాహం, ప్రతిభ ఈ కార్యక్రమాన్ని చాలా ప్రత్యేకంగా చేసింది. గీతం అధ్యాపకుల నుంచి వారికి తగిన మార్గదర్శనం లభించడమే గాక, వారి కళాత్మక ప్రతిభను అన్వేషించడంలో సహాయపడింది.ఈ కళాత్మక సాహసయాత్రలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇటువంటి కార్యశాలలు మున్ముందు మరిన్ని జరుపుకుందామని, అందుకు అందరూ సహకరించాలని వారు విజ్జప్తి చేశారు.
