పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నిజమైన సృజనాత్మకత లోపల నుంచి వస్తుందని, అది బోధించలేనిదని రెండు జాతీయ, ఐదు నంది అవార్డులను గెలుచుకున్న ప్రఖ్యాత చిత్ర దర్శకుడు నీలకంఠ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్-లో ‘షూటింగ్ నీలకంఠ’ పేరిట సోమవారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో తన అంతర్దృష్టిని పంచుకున్నారు. బహుముఖ ప్రజ్జ, వినూత్నమైన కథలు, సినిమాల్లో మార్పులేనితనం ప్రాముఖ్యతలను వివరిస్తూ, ‘ఒక్కొక్కటీ మూడు లేదా నాలుగు కళా ప్రక్రియల కలయికతో నేను విభిన్న రకాల చిత్రాలను చేశాను. ప్రయోగాలు చేస్తూ ఉండండి, అది మీ మనస్సును చురుకుగా, సజీవంగా ఉంచుతుంది. మీరు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని ఉత్పత్తి చేస్తున్నారని నిర్దారించుకోవడానికి తాజా ఆలోచనలతో విభిన్న మార్గాలను అనుసరించండి’ అని ఉద్బోధించారు.సినిమాపై తన తొలి ఆసక్తిని గుర్తుచేసుకుంటూ నీలకంఠ, తన ప్రయాణం 13, 14 ఏళ్ల చిన్న ప్రాయంలోనే ప్రారంభమైం దన్నారు. ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వం వహించిన ‘బుద్దిమంతుడు’ చూసిన తర్వాత, కెమెరా వెనుక మాయాజాలం జరిగేలా ఎవరో ఉన్నారని తాను గ్రహించానని చెప్పారు. ఈ ఆవిష్కరణ తనలో సినిమా పట్ల ఉత్సుకత, అభిరుచిని పెంచిందని, విజయవాడలోని లీలామహల్, నవరంగ్ టాకీస్-లు తన ‘నేర్చుకునే దేవాలయాలు’గా ఆయన అభివర్ణించారు. ఫిలిం స్కూల్స్ సినిమాతీసే మెళకువలను బోధిస్తాయే తప్ప సృజనాత్మకతను కాదని స్పష్టీకరించారు. చలన చిత్రాలను గమనించడం, వాటి సూక్ష్మ నైపుణ్యాలను మెచ్చుకోవడం, ఆ పాఠాలను అంతర్గతీకరించడం ద్వారా తనకు సినీ జ్జానం, ప్రేరణ వచ్చాయని చెప్పారు.
సినీ రచయితగా తన ప్రస్థానం అనుకోకుండా ఆరంభమైందని చెబుతూ, యువ సృజనాత్మకులకు అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలని నీలకంఠ సూచించారు. ఊహించని సవాళ్లను స్వీకరించి, తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంలో పట్టుదలతో ఉండడం వల్లే తనకు జాతీయ అవార్డులు లభించాయన్నారు. నటులు, దర్శకుల పాత్ర గురించి చెబుతూ, ఇద్దరి మధ్య పరస్పర అవగాహన అతి ముఖ్యమని నీలకంఠ స్పష్టీకరించారు. ‘దర్శకుడు నటుడిని నిజంగా అర్థం చేసుకోవడానికి, పాత్రను రూపొందించడానికి మార్గనిర్దేశం చేయాలి. నటుడు దర్శకుడి దృష్టిని పట్టుకోకపోతే, అది వారి ఇష్టం. దాన్ని దర్శకుడు బయటకు తీసుకురావాలి’ అన్నారు. పాటలను చొప్పించడం కాకుండా, నిజమైన భావోద్వేగంతో కథనాన్ని మెరుగుపరస్తున్నంత కాలం పాటల పట్ల ఆయన మక్కువను ప్రదర్శించారు.
చిత్ర నిర్మాణంలో కనులకింపుగా తీసే (విజువలైజేషన్) ప్రభావం గురించి, సరైన లొకేషన్ దర్శకుని దృష్టిని ఎలా ఖచ్చితంగా వ్యక్తపరుస్తుందని అనే దాని గురించి కూడా నీలకంఠ వివరించారు. తాను తీసిన చిత్రాలలో విరోధి తన మదిలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ చలన చిత్రాలను అందరికీ చేరువ చేస్తున్న ఓటీటీ వేదికను ఆయన ప్రశంసిస్తూ, మారుతున్న చలనచిత్ర అభిరుచికి అది నిదర్శనమన్నారు. సినిమాలపై విమర్శకులు అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో తప్పులేదు కానీ, అది ఫలానా వీక్షకులను ఆకట్టుకోలేకపోయిందంటూ, వారిని ఏ, బీ, సీ కేటగిరీలు వర్గీకరించి చెప్పడం తగదంటూ అసహనం వెలిబుచ్చారు. నేపథ్య సంగీతం సన్నివేశాలను అధిగమించకుండా, సమపాళ్లలో ఉండాలని, అది చిత్రం యొక్క భావోద్వేగ ప్రభావాన్ని మరింత పెంచుతుందని చెప్పారు. బలగం లాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలలో లోతు, ఔచిత్యం ఉన్నాయని ప్రశంసించారు.నీలకంఠ, ఆయన పనితీరును పరిచయం చేస్తూ నిర్వాహకులు, పరిమాణం కంటే నాణ్యతను విశ్వసించే ఒక అద్భుతమైన చిత్ర దర్శకుడిగా ఆయనను అభివర్ణించారు. షో, మిస్సమ్మతో సహా ఆయన సినిమాలు బలమైన పాత్రలు, అర్థవంతమైన కథలు, వినోదం, ఆత్మపరిశీలన మధ్య సమతుల్యతను సాధించడంలో ఆయన ప్రతిభను ప్రదర్శిస్తాయన్నారు.ఈ కార్యక్రమాన్ని వెంకట సుబ్బు పేటేటి సమన్వయం చేయగా, డాక్టర్ సుష్మ వందన సమర్పణతో ముగిసింది.