హనుమంతుడి జన్మస్థలంపై వివాదం….

Hyderabad

హనుమంతుడి జన్మస్థలంపై వివాదం…
– టీటీడీ వర్సెస్ శ్రీహనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్టు!
-ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రేనన్న టీటీడీ
-ఖండిస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన జన్మభూమి తీర్థ ట్రస్ట్
-కాదని నిరూపించాలని సవాలు విసురుతూ లేఖ రాసిన టీటీడీ

రామబంటు హనుమంతుడి జన్మస్థలం విషయంలో వివాదాలు నెలకొన్నాయి. ఆయన పుట్టుకపై టీటీడీ ,శ్రీహనుమద్ తీర్థ ట్రస్ట్ మధ్య నెలకొన్న వివాదం పై చర్చ మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం, కర్ణాటక కిష్కింధలోని శ్రీహనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ మధ్య వివాదం మొదలైంది. తిరుమలలోని అంజనాద్రిలోనే హనుమంతుడు పుట్టాడని టీటీడీ చేసిన ప్రకటనను శ్రీ హనుమద్ జన్మభూమి ట్రస్టు ఖండిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై టీటీడీ స్పందించింది. జన్మభూమి తీర్థ ట్రస్టు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తేల్చి చెబుతూ టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి లేఖ రాశారు.

టీటీడీ పండిత పరిషత్ నాలుగు నెలలపాటు శోధించిన అనంతరం పౌరాణిక, శాసన, భౌగోళిక ఆధారాలతోనే ఈ ప్రకటన చేసినట్టు ఆ లేఖలో వివరించారు. అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని శాస్త్రీయంగా నిరూపించే సంక్షిప్త నివేదికను సమర్పించామని పేర్కొన్నారు. నివేదికలో పేర్కొన్న ఆధారాలు, ప్రమాణాలు అసత్యాలని ట్రస్టు వ్యవస్థాపకులు నిరూపించాలని సవాలు విసిరారు. తగిన ఆధారాలతో ఈ నెల 20లోపు
నివేదికను సమర్పించాలని కోరారు. అంతేకాదు, టీటీడీపై చేసిన దూషణలకు లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *