_రాష్ట్ర క్రీడల శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ కి విన్నపం
మనవార్తలు ,పటాన్ చెరు;
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పటాన్ చెరు పట్టణానికి చెందిన మైత్రి క్రికెట్ క్లబ్ కు సభ్యత్వం అందించేందుకు సహకరించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కోరారు.మంగళవారం ఉదయం హైదరాబాదులోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.పటాన్ చెరుపరిధిలోని ఇక్రిశాట్ క్రికెట్ టీం గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యత్వం కలిగి ఉండి, వివిధ పోటీల్లో పాల్గొనేదని తెలిపారు.
గత పది సంవత్సరాలుగా ఇక్రిశాట్ క్రికెట్ జట్టు ఎటువంటి క్రీడా పోటీల్లో పాల్గొనడం లేదని, ఈ జట్టు స్థానంలో మైత్రి క్రికెట్ క్లబ్ కు అవకాశం ఇవ్వాలని ఇటీవల ఇక్రిశాట్ యాజమాన్యాన్ని కోరడం జరిగిందని మంత్రికి తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఇక్రిశాట్ అధికారులు, మైత్రి క్రికెట్ క్లబ్ కు అవకాశం ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అధికారికంగా సమాచారం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు తగు ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యే జిఎంఆర్ కోరారు.

పటాన్ చెరు నియోజకవర్గంలోనీ వివిధ మండలాల పరిధిలో నిర్మిస్తున్న మినీ స్టేడియాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి సహకరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ కోరారు.పటాన్ చెరు నియోజకవర్గాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలని సమున్నత లక్ష్యంతో ఏడు కోట్ల రూపాయలతో మైత్రి స్టేడియాన్ని పునరుద్ధరించడంతోపాటు, ఐదు ఎకరాల విస్తీర్ణంతో ఐదు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఉమ్మడి మెదక్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
