అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
అవినీతికి చిరునామాగా పేరొందిన కాంగ్రెస్ పార్టీని..మతోన్మాదం పేరుతో ప్రజల మధ్య విభజన రాజకీయాలు చేస్తున్న బిజెపి పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. ప్రత్యేక తెలంగాణ సాధించి దశాబ్ది కాలంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో ఎంపీపీ దేవానందం గృహంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో బిఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. బిఆర్ఎస్ పార్టీ విజయం అత్యంత ఆవశ్యకమని, వెంకట్రామ్ రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేసి భారీ మెజార్టీ అందించాలని వారికి సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మించి ఓట్లు సాధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, తాజా మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.