మనవార్తలు శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియపూర్ లో గలబికె ఎన్క్లేవ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శేరిలింగంపల్లి రెవిన్యూ డిపార్ట్మెంట్ మరియు గ్రేటర్ హైదరాబాద్ చందానగర్ సర్కిల్ 21 మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో చేతులు కలిపి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్స్ మరియు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నిర్మించడం పై ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవిన్యూ మరియు మున్సిపల్ అధికారులే కబ్జాదారులను ప్రోత్సహించి అక్రమాలకు పాల్పడుతున్న విషయం పై తగు చర్యలు తీసుకోవాలని స్థానికుడు టౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి లోకాయుక్త ను కోరాడు.
శేరిలింగంపల్లి మండల పరిధిలోని మక్త మహబూబ్పేట్ సర్వే నెంబర్ 44 బీకేఎన్ క్లేవ్ లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆర్ టి ఐ యాక్ట్ కింద చందానగర్ సర్కిల్ 21 ఉపకమిషనర్, శేరిలింగంపల్లి ఎమ్మార్వో కు ఆర్టిఐ యాక్ట్ కింద దరఖాస్తు చేయగా అసలు నిజాలు బయట పడ్డాయని ఆయన తెలిపాడు. బికె ఎన్ క్లేవ్ కు సంబంధించిన 44 సర్వే నంబరు మొత్తం ప్రభుత్వ భూమి అని, ఈ స్థలంలో భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతుల్లేవని చెప్పారు.
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం వారే ఎలాంటి అనుమతుల్లేవని చెప్పి లక్షల రూపాయలు లంచాలకు ఆశపడి బీకే ఎంక్లేవ్ అసోసియేషన్ రిజిస్టర్ నంబర్1268/2003 ప్రెసిడెంటుతో చేతులు కలిపి రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి మండల్ తాసిల్దార్ మరియు నాయబ్ తాసిల్దార్ మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ చందానగర్ సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారు బహుళ అంతస్తుల బిల్డింగ్స్ నిర్మిస్తుంటే అక్రమార్కులు ఇచ్చేటువంటి డబ్బులకు ఆశపడి వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో కమర్షియల్ మరియు రెంట్ పర్పస్ అపార్ట్మెంట్ కడుతుంటే అడ్డుకోకపోగా వారికి అండగా ఉండి కోర్టుల నుండి స్టేటస్ కో తెచ్చుకోవాలని వీరే సలహాలిస్తూ అక్రమార్కులకు అండగా నిలబడుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ స్థలాల్లో పేద వారు గుడిసె వేసుకుంటే ఆఘమేఘాల మీద వెళ్లి నానా హంగామా చేసే రెవెన్యూ, జీహెచ్ఎంసీ సిబ్బంది బహుళ అంతస్తుల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, అధికారులను అడిగితే అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మేరకు చూసీచూడనట్టు వారు ఇచ్చింది తీసుకొని వదిలి వేస్తున్నామని చెప్పడం జరుగుతుందని, అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ప్రజాధనానికి గండి పడుతోందని విమర్శించారు. కావున అక్రమార్కుల దగ్గర నుండి లక్షల రూపాయలు లంచాలు తీసుకుని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖలోని అవినీతి అధికారులపై చర్య తీసుకోని, బికె ఎన్ క్లేవ్ లో జరిగే అక్రమ కట్టడాలపై విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడడంతో పాటు ప్రజలకు చెందవలసిన వేల కోట్ల రూపాయల భూములను కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపాడు.