ఎన్ సీసీ శిబిరాన్ని ప్రారంభించిన కల్నల్ రమేష్ సరియాల్

Telangana

క్రమశిక్షణతో, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని క్యాడెట్లకు సూచన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సంగారెడ్డిలోని 33 (తెలంగాణ) బెటాలియన్ ఎన్ సీసీ క్యాడెట్ల కోసం నిర్వహిస్తున్న సంయుక్త వార్షిక శిక్షణా శిబిరాన్ని (సీఏటీసీ-III) కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రమేష్ సరియాల్ మంగళవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (రుద్రారం) ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడుతూ, దీని నిర్వహణ కోసం మంచి వసతులను కల్పించడమే గాక, అద్భుతమైన ఏర్పాట్లు చేసిన గీతం యాజమాన్యానికి కృతజ్జతలు తెలియజేశారు.క్యాడెట్లు కఠినమైన శిక్షణ పొందేందుకు, విలువైన జీవిత నైపుణ్యాలను నేర్చుకోవడానికి, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఒక వేదికగా ఇటువంటి శిబిరాలు ఉపకరిస్తాయని కల్నల్ సరియాల్ చెప్పారు. అంకితభావం, క్రమశిక్షణ, స్నేహ స్ఫూర్తితో మెలగాలని క్యాడెట్లకు సూచించారు. వ్యక్తులుగా మాత్రమే కాకుండా, దేశంలోని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఇదో మంచి అవకాశంగా అభివర్ణించారు.

ప్రతి సవాలునూ స్వీకరించాలని, ప్రతి కార్యక్రమం నుంచి నేర్చుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన అభిలషించారు.దేశభక్తి, నిస్వార్థ సేవల ప్రాధాన్యాన్ని క్యాడెట్లకు కల్నల్ సరియాల్ వివరిస్తూ, సూచనలను శ్రద్ధగా పాటించాలని, బాధ్యతలను విస్మరించుకూడదన్నారు. నాయకత్వం, క్రమశిక్షణ వంటివి సేవ చేయడానికి ముందుకు రావడంతో ఆరంభమవుతాయని అన్నారు. శారీరక దృఢత్వం, మానసిక శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను కూడా ఆయన వివరించారు. డ్రిల్, శారీరక శిక్షణ (పీటీ), యోగా వంటి రోజువారీ కార్యక్రమాలతో పాటు ఆతిథ్య ఉపన్యాసాలు, సైద్ధాంతిక మాడ్యూళ్లను క్యాడెట్ల సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు చెప్పారు.

క్యాడెట్లంతా ఒకరితో మరొకరు సంభాషించుకోవాలని, కొత్త స్నేహాలను నిర్మించుకోవాలని, సామూహిక జీవన అనుభవాన్ని గౌరవించాలంటూ కల్నల్ సరియాల్ ప్రోత్సహించారు. జీవితం అనేక సవాళ్లను మన ముందు ఉంచుతుందని, స్థితిస్థాపకత, పరిపక్వత, సమష్టి కృషితో వాటిని అధిగమించి విజయాన్ని సాధించాలని సూచించారు.ఈ పది రోజుల శిబిరంలో, తెలంగాణ వ్యాప్తంగా 600 మంది క్యాడెట్లు పాల్గొంటుండగా, వారిలో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడానికి, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి, నిర్మాణాత్మక శిక్షణ, కార్యకలాపాల ద్వారా జీవితకాల విలువలను నిర్మించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని ఈ శిబిరం కల్పిస్తోంది.ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సుబేదార్ మేజర్, అసోసియేట్ ఎన్ సీసీ ఆఫీసర్లు, తెలంగాణలోని ఎన్ సీసీ 9, 12, 32, 33వ బెటాలియన్ల క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు. ఈ అపూర్వ సన్నివేశాన్ని కలకాలం గుర్తుంచుకునేలా గ్రూపు ఫోటోతో ఈ కార్యక్రమం ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *