_సభాస్థలి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్ రావు
_సభ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు సంజీవినిగా మారనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా గురువారం ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు.బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్, తదితర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గురువారం ఉదయం 10 గంటలకు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని, అనంతరం నాగులపల్లి లో నూతనంగా ఏర్పాటుచేసిన మేధా రైల్వే కోచ్ పరిశ్రమను సందర్శిస్తారని తెలిపారు.అనంతరం పటాన్చెరు పట్టణంలో 200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. నూతన ఆసుపత్రి ఏర్పాటుతో ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా చెందిన పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సీఎం కేసీఆర్ కార్యక్రమం విజయవంతం చేయాలని శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ రాక పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఒక వరం లాంటిదని అన్నారు. ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గ ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పి రమణ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.