– ఈనెల 28-29న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
– ఇతర యూనియన్లకు ఆదర్శంగా శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్
శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం లో అఖిలభారత సిఐటియు ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు
మనవార్తలు , పటాన్ చెరు
అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులక నుకూలంగా మోడీ ప్రభుత్వం మార్పులు చేస్తుందని అఖిలభారత సిఐటియు ఉపాధ్యక్షులు ఎన్.సాయిబాబు ఆరోపించారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం ఈ సమావేశానికి విచ్చేసిన సాయిబాబు మాట్లాడుతు 37 సం౹౹ గా యూనియన్ ను ఐక్యంగా నిలబెట్టుకుంటూ అనితరసాధ్యమైన విజయాలు సాధించడమే కాక కార్మిక వర్గ చైతన్యం కోసం, హక్కులకొరకు జరిగే పోరాటాలు, పిలుపులు అమలులో అగ్రభాగాన ఉంటూ ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిచే శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ కి అభినందనలు తెలియచేశారు.
ఈనెల 28, 29 తేదీలలో జరిగే దేశవ్యాప్త సమ్మె ఎందుకు జరుగుతున్నదో, ముఖ్యంగా ఎలాంటి సందర్భంలో జరుగుతున్నదో కార్మికవర్గానికి తెలియజేయవసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని అన్నారు. 2014 లో బీజేపీ అధికారంలోకి రాక ముందు వరకు జరిగిన దేశవ్యాప్త సమ్మెలలో బిఎంఎస్ పాల్గొన్నదని రాజకీయ కారణాలతో వారు పాల్గొనకపోయినా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయని గుర్తు చేశారు. భారతదేశ మౌలిక వసతులకు సంబందించిన అన్ని వనరులను ప్రయివేటుకి అప్పజెప్పే నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ ను గనుక అమలుచేస్తే, మౌలిక వసతులపై ప్రభుత్వం యొక్క నియంత్రణ లేకపోతే రవాణా, ఆరోగ్యం తోబాటు అన్ని భారాలు ప్రజలపై తీవ్రస్థాయిలో పడతాయని అన్నారు.
స్వాతంత్రానికి పూర్వమే మన పూర్వీకులు అనేక త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కరోనా లాక్ డౌన్ సమయంలో కనీసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కి పంపకుండా యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ గా మార్చడం జరిగిందని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. లేబర్ కోడ్స్ పెట్టుబడులు పెరగటానికి, ఉపాధి పెరగటానికి తెచ్చామని ప్రభుత్వం చెబుతోందని కానీ యజమానుల లాభాలు పెరగడానికి, కార్మికుల ప్రయోజనాలు తగ్గించడానికి మాత్రమే ఇవి పనిచేస్తాయని చెప్పారు. 8 గం. పని, ఓటి, సమ్మె చేసేహక్కు, ఈఎస్ఐ. పీఎఫ్ లాంటి హక్కులు ప్రశ్నార్థకమవుతాయని, కార్మికవర్గం తిరిగి బానిసత్వంలోకి నెట్టబడతారని ఆయన వాపోయారు.
కార్మికులకు నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస పెన్షన్ 10 వేలు ఇవ్వాలని, ప్రజల ఆస్తులను ప్రయివేటు కి ధారాదత్తం చేసే డీమోనిటైజేషన్ పైప్ లైన్ ను ఉపసంహరించాలని, ఇంకా అనేక డిమాండ్స్ చేస్తూ జరిగే రెండురోజుల దేశవ్యాప్త సమ్మెలో కార్మికవర్గం జెండాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చెయ్యాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు, ఆఫీస్ బేరర్స్, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.