పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గడిలపై గళమెత్తి, తెలంగాణ రాష్ట్రంలో భూ పోరాటానికి నాంది పలికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఆయన ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించి మహిళా చైతన్యానికి స్ఫూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ పేరును హైదరాబాదులోని మహిళా విశ్వవిద్యాలయానికి నామకరణం చేశారని గుర్తు చేశారు. వారి వారసులకు సైతం సమచిత గౌరవం కల్పించారని పేర్కొన్నారు. జాతీయ రహదారి విస్తరణ పనుల అనంతరం పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై అతి త్వరలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకటేష్, శంకర్, రజక సంఘం అధ్యక్షుడు మహేష్, తదితరులు పాల్గొన్నారు.