మనవార్తలు ,పటాన్‌చెరు:
ధరల పెరుగుదలతో నిర్మాణ రంగం కుదేలైందని ఎపిఆర్ గ్రూప్ చైర్మన్ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగానికి గుదిబండగా మారిన పెట్రోల్, డీజిల్, సిమెంట్, స్టీల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ ఎపిఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు శివారులోని ఎపిఆర్ సంస్థ కార్యాలయం వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధరలను తగ్గించకపోతే లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. ఎప్పుడు ఏ విధంగా ధరలు పెరుగుతాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నామని తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు గృహ నిర్మాణాలు కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ధరల పెరుగుదలతో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ధరలను నియంత్రించాలని తెలిపారు. లేని పక్షంలో ఒకరోజు నిరసన ప్రదర్శనతో ఆగకుండా నెల రోజులైనా పనులు ఆపి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎపిఆర్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.