మనవార్తలు ,పటాన్చెరు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు పటాన్చెరు నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకుల సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇకనుండి భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా ప్రకటించడంతో.. అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఆ పార్టీ నాయకులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక భూమిక పోషిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. గల్లి నుండి ఢిల్లీ దాకా అన్ని స్థాయిల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్ని వర్గాల మద్దతు లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్ రాష్ట్ర సమితి పటాన్చెరు పట్టణ అధ్యక్షులు అఫ్జల్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..