సిగాచి ఘోర ప్రమాదానికి 6 నెలలు
సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఐడిఏ పాశమైలారం క్లస్టర్ కన్వీనర్ అతిమేల మానిక్
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సీగాచి ఘోర ప్రమాదం జరిగి 54 మంది కార్మికులు బలైన ఘటనకు 6 నెలలు గడిచి పోయిందని, అయినా నేటికీ బాధితులకు కోటి రూపాయల నష్టపరిహారం పూర్తిగా అందలేదని, పెండింగ్ నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఐడిఏ పాశమైలారం ఇండస్ట్రియల్ క్లస్టర్ కన్వీనర్ అతిమేల మాణిక్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.సిగాచి పరిశ్రమ ఘోర ప్రమాదంలో 54 మంది కార్మికులు మృత్యువాత పడిన ఘటనకు 6నెలలు అయిన సందర్భంగా సోమవారం సాయంత్రం పాశమైలారం పారిశ్రామిక వాడలోని బిపిఎల్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ సిగాచి ఫార్మా పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 54 మంది కార్మికులు మృతి చెంది ఆరు నెలలకు గడిచిన తర్వాత కంపెనీ సీఈవో అమిత్ రాజ్ సిన్హా ను అరెస్ట్ చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకున్నారని అన్నారు.
ఇప్పటికైనా యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం హర్షించదగిందని అన్నారు. కానీ బాధిత కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల నష్టపరిహారం నేటికీ పూర్తిగా ఇవ్వలేదని అన్నారు. పూర్తి నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యం, అంత్యక్రియలకు అయిన ఖర్చులు చట్టబద్ధంగా కార్మిక కుటుంబాలకు రావాల్సిన డబ్బులు నష్టపరిహారంలో కలపొద్దని, అధికారులు వీటన్నిటిని కోటి రూపాయల్లో కల్పి చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదం నుండి బతికి బయటపడిన కార్మికులకు గత ఆరు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేయడంతోనే పూర్తిగా ఖాళీ బూడిదైనా డీఎన్ఏకు దొరకని 8 మంది బాధితులకు డెత్ సర్టిఫికెట్స్ ఇచ్చారని గుర్తు చేశారు. వారికి మిగతా పరిహారం వెంటనే ఇవ్వాలని, ఈ ఘోర ప్రమాదంపై జరిపిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలన్నారు.
యాజమాన్యంపై చర్యలు తీసుకొని అరెస్టు చేసి జైలుకు పంపినంత మాత్రాన సరిపోదని పరిశ్రమల్లో ప్రమాదాలను అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు నాయకులు వెంకటేష్, శేఖర్ రెడ్డి, ప్రవీణ్, సతీష్, శ్రీకాంత్, ప్రశాంత్ రెడ్డి, రాము, శ్రీనివాస్, చంద్రయ్య, ప్రభు, అన్నాజీ రావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
