_వరుసగా రెండోసారి ఘన విజయం
_విశ్వసనీయతకు మారుపేరు ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వం
_కలిసి పోటీ చేసిన సిఐటియు, ఐ ఎన్ టి యు సి కూటమికి తప్పని ఓటమి
_59 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పెన్నార్ పరిశ్రమలో నిర్వహించిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బిఆర్టియు జయకేతనం ఎగరవేసింది. వరుసగా రెండుసార్లు గెలిచి కార్మికుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంది. బుధవారం పరిశ్రమలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో.. మొత్తం 508 ఓట్లకు గాను 507 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రెండు ఓట్లు చెల్లక పోగా, బిఆర్టియు సంఘానికి 282 ఓట్లు, సిఐటియు ఐ ఎన్ టి యు సి ఐక్య కూటమికి 223 ఓట్లు పోలయ్యాయి. 59 ఓట్ల మెజారిటీతో బిఆర్టియు వరుసగా రెండవసారి ఘన విజయం సాధించింది. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మార్గదర్శకత్వంలో బి ఆర్ టి యు తరఫున సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ అధ్యక్షుడిగా పోటీ చేశారు. బిఆర్టియును ఓడించాలన్న లక్ష్యంతో సిఐటియు, ఐ ఎన్ టి యు సి యూనియన్లు కూటమిగా పోటీ చేసిన వారికి పరాజయం తప్పలేదు. ఈ సందర్భంగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా పటాన్చెరు నియోజకవర్గంలోని కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు, వారి కష్టసుఖాల్లో అండగా నిలిచామని తెలిపారు. గత పదిలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కార్మికులకు తగు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. వరుసగా రెండుసార్లు బి ఆర్ టి యు యూనియన్ ను గెలిపించిన పెన్నార్ కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ఆయన తెలిపారు. బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పెన్నార్ పరిశ్రమలో వరుసగా రెండోసారి బిఆర్టియు యూనియన్ ఘన విజయం సాధించడం జరిగిందని తెలిపారు. యూనియన్ విజయానికి సహకరించిన ప్రతి కార్మికుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.