సామాజిక అవగాహనను ప్రోత్సహించడానికి నిర్వహించిన గీతం స్టూడెంట్స్ క్లబ్ చరైవేతి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రుద్రారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘బ్రదర్ హుడ్ డే’ని ఇటీవల గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థి విభాగం చరైవేతి నిర్వహించింది. గీతం ఆతిథ్య విభాగం ప్రోత్సాహంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం, బాలల మనస్సులో సామాజిక అవగాహన, ఐక్యత, కరుణను పెంపొందించేందుకు లక్ష్యించారు.ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా, నోటి ఆరోగ్యం, పరిశుభ్రతను ప్రోత్సహించడానికి మహేశ్వర మెడికల్ కళాశాల వైద్యుల సహకారంతో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులకు అక్కడే దంత పరీక్షలు జరిపి, మంచి నోటి సంరక్షణ పద్ధతులపై వారికి అవగాహన కల్పించారు.బాలల వ్యక్తిగత భద్రత, శరీర స్వయం ప్రతిపత్తి వంటి సున్నితమైన అంశాలను విడమరిచి చెప్పారు. తమను తాము రక్షించుకోవడానికి, సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకోవడానికి అవసరమైన జ్జానాన్ని వారికి వివరించి, మంచి స్పర్శ, చెడు స్పర్శలపై అవగాహన కల్పించారు. విద్యార్థులందరికీ ఉపయోగపడే స్టేషనరీ కిట్లు, శీతల పానీయాలను పంపిణీ చేశారు.మొత్తం మీద ఈ కార్యక్రమం, గీతం యొక్క సమగ్ర విద్య, సమాజ శ్రేయస్సుకు నిదర్శనంగా నిలిచి, పాఠశాల బాలలపై శాశ్వత ముద్ర వేసింది అనడంలో అతిశయోక్తి లేదు.