_ప్రచార ఆర్భాటం తప్ప , ప్రజారోగ్యం పై శ్రద్ద ఏది ?
_పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవా ?
_ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడ్డ వ్యక్తికి కుట్లు వేసిన వాచ్ మెన్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత వల్ల గాయపడిన యువకుడికి వాచ్ మెన్ కుట్లు వెయ్యడం దురదృష్టకరమని మాజీ జెడ్పీటీసీ, బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఆయన శనివారం ముత్తంగి తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యం వహించిన తీరు సరియైనది కాదని, సంఘటన జరిగిన రోజు నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్కరినీ తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇందుకు సంబందించిన వీడియోను ఆయన తన మొబైల్ లో విలేకరులకు చూపించారు. వైద్య శాఖ మంత్రి సోంత జిల్లాలో పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్రంలోని మిగతా ఆసుపత్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంఘటన పై ఏ రకమైన చర్యలు తీసుకుంటారో తమకు వివరణ ఇవ్వాలని లేని పక్షంలో భారతీయ జనతాపార్టీ తరపున పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిని, ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సాయి కుమార్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు జోగు ధన్ రాజ్, బిజేవైయం నాయకులు రాజ్ గోపాల్ యాదవ్, సంగమేశ్వర్, ఆదిత్య, ఎస్ఆర్కే యువసేన సభ్యులు మచ్చ కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
