పటాన్ చెరులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
మన వార్తలు ,పటాన్ చెరు:
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ రైతుల ఉసురు తీస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధ్వజ మెత్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చావు డప్పు మోగించినట్లు తెలిపారు.
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. రైతుల ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వానికి భవిష్యత్తు ఉండదని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని బిజెపి నాయకులు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. అబద్ధపు ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

రైతాంగం సంక్షేమం కోసం వినూత్న పథకాలను తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అనంతరం జాతీయ రహదారిపై కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
