గాత్ర సంస్కృతిపై గీతం విద్యార్థులకు అవగాహన

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్), హైదరాబాదులోని కళలు, ప్రదర్శన కళల విభాగం ఆధ్వర్యంలో బుధవారం గాన సంస్కృతి (వాయిస్ కల్చర్)పై హైబ్రిడ్ విధానంలో కార్యశాల నిర్వహించారు.చెన్నైలోని కే.ఎం. మ్యూజిక్ కన్జర్వేటరీ (ఏ.ఆర్. రెహమాన్ ఫౌండేషన్)లోని హిందూస్థానీ మ్యూజిక్ ఫ్యాకల్టీ డాక్టర్ హంబుల్ షైన్ ఈ కార్యశాలలో ప్రధాన శిక్షకుడిగా పాల్గొన్నారు. దీనిని ఆయన ఆన్ లైన్ లో నిర్వహించి, స్వర శిక్షణ యొక్క శాస్త్రీయ, కళాత్మక అంశాలపై విలువైన అంతర్దృష్టులను విద్యార్థులకు అందించారు.ఒక గాయకుడు తమ గొంతును ఉపయోగించే వివిధ స్థాయిలు లేదా శ్రేణులు (రేంజెస్) గొంతు కదలికలు, నాణ్యతలో మార్పులను బట్టి మారతాయని హంబుల్ షైన్ చెప్పారు. ఛాతీ స్వరం (ఛెస్ట్ వాయిస్) తక్కువ స్థాయి స్వరాలు, మధ్యమ స్థాయి, హెచ్చు స్థాయి స్వరాలు (హెడ్ వాయిస్), సాధారణ స్వరాలు (ఫాల్సెట్టో), అత్యంత హెచ్చు స్వరస్థాయి లేదా ఈల వంటి ధ్వని (విజిల్ రిజిస్టర్)లతో సహా వివిధ స్వర స్థాయిల గురించి ఆయన వివరించారు.

గాయకులు రాగాలను తగిన స్వర శ్రేణిలో ఎలా సమర్థవంతంగా పాడగలరో తెలుపుతూ, అదే సమయంలో స్వరంలో హెచ్చుతగ్గులు (మాడ్యులేషన్), స్వరాన్ని స్పష్టంగా లేదా దూరం వరకు వినిపించేలా (ప్రొజెక్షన్) చేసే నియంత్రణా పద్ధతులను కూడా ప్రదర్శించారు. ఈ కార్యశాలలో సందర్భాను సారం శైలి (రిజిస్టర్ బ్లెండ్), రెండు అచ్చులు కలిసి ఒకే శబ్దాన్ని పలికే విధానం (వోవల్ బ్లెండ్) వంటి స్వర మిశ్రమ పద్ధతులను కూడా వివరించారు. ఇవి గానంలో శబ్ద సమతుల్యత (టోనల్ బ్యాలెన్స్), సున్నితమైన పరివర్తనలను సాధించడానికి అవసరమన్నారు.

సాంకేతిక అంశాలతో పాటు, గానం యొక్క మానసిక కోణాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. గాత్ర ప్రదర్శనలో మానసిక సంసిద్ధత, నిరీక్షణ, ఏకాగ్రత, భావోద్వేగ సంబంధం యొక్క ప్రాముఖ్యతలను విశదీకరించారు.ఈ కార్యశాల చివర్లో విద్యార్థులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవడానికి ప్రోత్సహించారు. ఆయన చేసిన ఆచరణాత్మక సూచనలు, ప్రభావవంతమైన స్వర స్థాయిల యొక్క సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి విద్యార్థులకు సహాయపడింది.ఈ కార్యశాలను లలిత, ప్రదర్శన కళల విభాగ అధ్యాపకులు ఆనందు మురళి, దర్భా మృదురవళి నిర్వహించి, సమన్వయం చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు వృత్తిపరమైన గాత్ర శిక్షణ పద్ధతులకు విలువైన అవగాహనను అందించడమే గాక, సంగీత ప్రదర్శనలో గాత్ర సంస్కృతిపై వారి అవగాహనను పెంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *