పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, సమతుల్య ఆహారంపై అవగాహన పెంపొందించినప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి అన్నారు.గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని పీవీ నరసింహారావు ఆడిటోరియంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ అభియాన్–పోషణ మాసం వారోత్సవాల కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, మహిళలకు అందిస్తున్న పోషకాహార సేవలు, ఆరోగ్య కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. చిన్నారులతో అక్షరాభ్యాసం నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన కుటుంబానికి మహిళల ఆరోగ్యం పునాది వంటిదని అన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించడంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.పోషకాహార లోపం వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, అందువల్ల చిన్నారులకు చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు.
ప్రతి ఇంటిలో పోషకాహారంపై అవగాహన పెరిగితేనే సమాజంలో ఆరోగ్యకరమైన మార్పు సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. పోషణ్ అభియాన్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలను ఆమె అభినందించారు. పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణపై గ్రామాలు, కాలనీల్లో మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, ఐసిడిఎస్ సిడిపిఓ జయరాం నాయక్, ఎంఈఓ నాగేశ్వరరావు నాయక్, రామ్మోహన్, అంగన్వాడీ సిబ్బంది, మహిళలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.
