పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని లలిత, ప్రదర్శన కళల విభాగం ‘సాధన-2025’ పేరిట విద్యార్థుల కళాత్మక ప్రతిభా ప్రదర్శనను మంగళవారం నిర్వహించింది. మైనర్ ప్రోగ్రామ్, ఓపెన్ ఎలక్టివ్ (ఓఈ) కోర్సులను అభ్యసించే విద్యార్థులు ఈ కార్యక్రమంలో కర్ణాటక సంగీతం, భరతనాట్యం, కూచిపూడిలో ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఇచ్చారు. అవి భారతీయ ప్రదర్శన కళల గొప్ప సంప్రదాయాలను ప్రతిబింబించాయి.ఐగిరి నందిని ప్రార్థనతో ప్రారంభమైన ఈ వేడుకలో మనస్తత్వ శాస్త్రం (సైకాలజీ), బీబీఏ, బీఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్న మూడో ఏడాది విద్యార్థులు – ఉమా శ్రీనిధి ముదపాక, ఐశ్వర్య భట్టు, హరిదాసు విజయ జాహ్నవి, గోవిందు లికితలు – పుష్పాంజలి, అలరిపుతో ప్రారంభమై, పూర్తి మార్గం భరతనాట్య ప్రదర్శనతో పాటు థిల్లానాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

కూచిపూడి విభాగం నటరాజ స్వామికి పూజా నృత్యంతో ప్రారంభమై, తాళం ఆదిలోని రాగమాలికతో ముగిసింది. సాయి రమణి, జ్యోత్స్న, అనన్య, వర్ష, శ్రీవర్షిణి, పద్మిని, లక్ష్మీ ప్రసన్న, ఆస్మిత మాళవిక జోషి, మ్రేణికారెడ్డి, త్విషా నిధిప, శ్రీకానిధి, ప్రవళిక తమ మనోహరమైన నృత్యంతో ప్రేక్షకులను మైమరపించారు.కర్ణాటక సంగీతం విభాగంలో విద్యార్థులు శక్తి సహిత గణపతిం, శ్యామలే మీనాక్షి, పలుకే బంగారమాయెనా, గంధము పూయరుగ వంటి మనోహరమైన స్వరకల్పనలను ఆలపించారు. ఆనంద్, దీపక్, వర్ష, అభ్యుదయ్, నితిన్, జ్యోత్స్న, భార్గవి శ్వేత శ్రీ, విశ్వజనని, భావన, లక్ష్మీగాయత్రి, సాయిలేఖన, సుచి పాండే తమ గాత్ర నైపుణ్యంతో మైమరపించారు.

సాధన-2025లో పాల్గొనడం ఒక స్ఫూర్తిదాయమైన అభ్యాస అనుభవం అని విద్యార్థులు తమ ప్రతిస్పందనలో పేర్కొన్నారు. శారీరక, మానసిక, భావోద్వేగ క్రమశిక్షణ యొక్క శక్తివంతమైన మిశ్రమంగా నృత్యాన్ని వారు అభివర్ణించారు.సహ కళాకారులు అంజు అరవింద్, డాక్టర్ వై. లలిత సింధూరి (నట్టువాంగం), ఆనందు మురళి, మృదురవళి దర్భ (గాత్రం), మోహవాది వాసు విశ్వనాథ శాస్త్రి (వయోలిన్), చంద్రకాంత్ (మృదంగం) తదితరులు విద్యార్థులకు సహకరించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ అంజు అరవింద్ కన్వీనర్ గా, డాక్టర్ వై. లలిత సింధూరి సమన్వయకర్తగా, కూచిపూడి అసిస్టెంట్ ప్రొఫెసర్ వైష్ణవి ప్రతివాది కంపేరర్ గా వ్యవహరించారు.
‘సాధన-2025’ వేడుక విద్యార్థులు తమ సృజనాత్మకత, క్రమశిక్షణ, శాస్త్రీయ కళారూపాల పట్ల అంకితభావాన్ని వ్యక్తీకరించడానికి ఒక శక్తివంతమైన వేదికను అందించింది. సంపూర్ణ, సాంస్కృతికంగా సుసంపన్నమైన విద్యను పెంపొందించడంలో గీతం యొక్క నిబద్ధతను చాటిచెప్పింది.
