– అక్టోబరు 11, 12వ తేదీల్లో ముఖ్యమంత్రితో పలు ప్రారంభోత్సవాలు
– వెనుకబడిన పేద వర్గాల భక్తులకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం
తిరుమల
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబరు 7 నుండి 15వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి గారు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ గారు మాట్లాడుతూ అక్టోబరు 7వ తేదీ గురువారం సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో వాహనసేవలు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తామని, గరుడసేవ మాత్రం రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. ఈసారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తుండడం వలన స్వర్ణరథం, రథోత్సవం ఉండవని, వీటికి బదులు సర్వభూపాల వాహనసేవ జరుగుతుందని తెలియజేశారు. ఈ నెల 15వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు భక్తితో ఆసక్తిగా ఎదురు చూస్తారని, ఈ ఏడాది కూడా కోవిడ్-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు.
స్వామివారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆగమోక్తంగా నిర్వహించే కార్యక్రమాలు యథాతథంగా జరుగుతాయన్నారు. భక్తులు ఈ వేడుకలు చూడటం కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు. ఎస్వీబీసీ క్లీన్‌ఫీడ్ ద్వారా ఇతర ఛానళ్లలో కూడా బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చర్యలు చేపట్టారు. టిటిడి ప్రజాసంబంధాల విభాగం ద్వారా మీడియాకు ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు, ఫొటోలు అందిస్తామని చెప్పారు. ఆగమపండితుల సలహాలు, సూచనల మేరకు ఈసారి స్వామివారి చక్రస్నానం ఆలయంలోని ఐన మహల్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
దర్శన టికెట్లు ఉన్నభక్తులు మాత్రమే తిరుమలకు రావాలని విజ్ఞప్తి
కోవిడ్ వ్యాప్తి కట్టడిలో భాగంగా దర్శన టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు. దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు వ్యాక్సినేషన్ పూర్తి అయిన సర్టిఫికెట్ గానీ, దర్శనానికి మూడు రోజుల ముందు ఆర్‌టిపిసిఆర్ పరీక్ష చేయించుకుని తీసుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు.
ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ప్రారంభోత్సవాలు
ఈ నెల 11వ తేదీ గరుడసేవ రోజున సాయంత్రం ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు చేస్తారని ఛైర్మన్ తెలిపారు.
అక్టోబరు 11న
– తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి పాత బ్లాక్‌లో తాత్కాలికంగా రూ.25 కోట్లతో వ్యయంతో నిర్మించిన చిన్నపిల్లల పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి ప్రారంభం.
– అలిపిరి పాదాల మండపం వద్ద చెన్నైకి చెందిన దాత రూ.15కోట్ల విరాళంతో నిర్మించిన గోమందిరం ప్రారంభం. ఇందులో గోప్రదక్షిణ, గోతులాభారం, గోవు ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేలా ఏర్పాట్లు చేపట్టారు.
– రూ.25 కోట్ల వ్యయంతో దాత పునఃనిర్మించిన అలిపిరి నుంచి తిరుమల నడకదారి పైకప్పు ప్రారంభం.
.
అక్టోబరు 12న
– తిరుమలలో ఇండియా సిమెంట్స్ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందిపోటు ప్రారంభం.
– ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్ల ప్రసారాలు ప్రారంభం. కర్ణాటక ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
వెనుకబడిన పేద వర్గాల భక్తులకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం
రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి రోజుకు సుమారు వెయ్యి మంది చొప్పున వెనుకబడిన పేద వర్గాల భక్తులకు అక్టోబరు 7 నుండి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం చేయించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్టు ఛైర్మన్ వెల్లడించారు. వీరికి తిరుమల శ్రీవారి దర్శనంతోపాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేయిస్తామన్నారు.సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో టిటిడి మొదటి విడతలో రూ.25 కోట్లతో 13 జిల్లాల్లో 502 ఆలయాలు నిర్మించామన్నారు.
ఈ ఆలయాలు నిర్మించిన వెనుకబడిన ప్రాంతాల నుండి పేదవర్గాల వారిని బ్రహ్మోత్సవాల సమయంలో ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయించడం జరుగుతుందన్నారు. ఒక్కో జిల్లా నుండి 10 బస్సులు ఏర్పాటుచేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి దర్శనం చేయించి తిరిగి వారి ప్రాంతాలకు తీసుకెళతామని చెప్పారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు మార్గమధ్యంలో స్థానిక దాతల సహకారంతో ఆహార పానీయాలు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు.