మనవార్తలు ,అమీన్పూర్:
రాబోయే మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రమైన బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గుడి మైపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శివరాత్రి సందర్భంగా నిర్వహించే జాతర ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా పార్కింగ్, క్యూలైన్లు, మంచినీటి సౌకర్యం, భద్రత సౌకర్యాలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి మహా జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, డీఎస్పీ భీమ్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ తులసి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.