గీతమ్ ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు….

Districts politics Telangana

మన వార్తలు ,పటాన్ చెరు:

దేవుని ప్రేమను పంచుకోవడానికి , శాశ్వతమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి క్రిస్మస్ సరైన సమయం . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ముందస్తు క్రిస్మస్ పండుగ సంబరాలను విద్యార్థులు , అధ్యాపకులు చాలా ఉత్సాహంగా , ఉల్లాసంగా జరుపుకున్నారు . సహజంగా క్రిస్మస్ ఉల్లాసం , ప్రేమను తెస్తుంది . ఆ సందేశాన్ని విద్యార్థులు ఈ వేడుకల నిర్వహణ ద్వారా వ్యాప్తిచేశారు . శోభయమానంగా బెలూన్ల అలంకరణ , చావడిలో క్రీస్తు జననం వంటి దృ శ్యాలతో పాటు క్రిస్మస్ గీతాలతో ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది . ఆధ్యాత్మిక గీతాలకు చక్కని వాద్య సహకారం కిన్నెర ఆడిటోరియాన్ని రసరమ్యంగా మార్చివేసింది .

తన్మయులైన కొందరు విద్యార్థులు సంగీతానికి అనుగుణంగా , లయబద్ధంగా కదులుతూ , రెండు చేతులతో చప్పట్లు కొడుతూ , నృత్యాలు చేస్తూ , వంత పాడుతూ తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు . ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులందరినీ ఆకట్టుకుని , ప్రేమ పారవశ్యంతో పాటు ఆధ్యాత్మికతను ప్రేరేపించాయి . ముఖ్యంగా ఉర్రూతలూగించే క్రిస్మస్ పాటలకు ప్రేక్షకులంతా గొంతు కలపడం విశేషం . క్రిస్మస్ స్ఫూర్తిని , మానవాళి కోసం యేసుక్రీస్తు జన్మ , త్యాగాన్ని చాటిచెబుతూ ప్రదర్శించిన ఆంగ్ల నాటిక అందరి హృదయాలలో అర్హతను నింపింది .

యువతీ యువకుల పాటలు , నృత్యాలు పండుగ వాతావరణాన్ని సృష్టించాయి . ముఖ్యంగా , క్రిస్మస్ చెట్టుకు వేలాడదీసిన ఆభరణాలు , మెరిసే నక్షత్రం , బంగారు వెండి రంగుల గంటలు , క్యాండీలు , పుష్పగుచ్ఛాలు , రంగు రంగుల పేపర్లు ఆహ్లాదభరితమైన పండుగ వాతావరణానికి మచ్చుతునకగా నిలిచాయి . క్రిస్మస్ తాత శాంతాక్లాజ్ చేతి సంచిలోని బహుమతులను పంచుతూ , హాలంతా కలియ తిరుగుతూ , మధ్య మధ్యలో నృత్యాలు చేస్తూ విద్యార్థులందరిలో ఉత్సాహాన్ని నింపారు . చివరగా వేడుకలలో పాల్గొన్న వారందరికీ మిఠాయిలు , శీతల పానీయాలు , నీళ్ళ సీసాలతో కూడి కిట్లను పంచిపెట్టారు . మొత్తం ప్రాంగణమంతా క్రిస్మస్ గీతాల ప్రతిధ్వనితో మార్మోగిపోయింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *