_భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ శ్రేణులు
_బి ఆర్ ఎస్ కు బలం.. బలగం కార్యకర్తలే
_కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు..
అమీన్పూర్.మనవార్తలు ప్రతినిధి :
స్వరాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, బిఆర్ఎస్ పార్టీకి బలం బలగం కార్యకర్తలేనని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం సాయంత్రం బీరంగూడలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్, మండల స్థాయి ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బీరంగూడ కమాన్ నుండి ఫంక్షన్ హాల్ వరకు భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీతో ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 60 లక్షల మంది సభ్యత్వంతో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అజేయ శక్తిగా నిలిచిందని అన్నారు. పార్టీ పటిష్టతకు వెన్నుముకగా నిలిచిన ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కార్యకర్తలు పని చేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గడపగడపకు వివరించాలని కోరారు.గత ప్రభుత్వాల హాయంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పల్లెలు, పట్టణాలను ఎనిమిదేళ్ల కాలంలోనే అభివృద్ధిలో ఆదర్శంగా, సంక్షేమంలో నెంబర్ వన్ గా నిలిపామని తెలిపారు. అసాధ్యం అనుకున్న పనులను సైతం సుసాధ్యం చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కిందని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అమీన్పూర్ గ్రామాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసి.. ప్రతి కాలనీని అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట వరకు 75 కోట్ల రూపాయలతో 100 ఫీట్ల రహదారిని నిర్మించడంతోపాటు.. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా నాలుగు భారీ రిజర్వాయర్ల పనులను చేపట్టామని తెలిపారు.ప్రజల సమస్యల పరిష్కారంలో పక్షపాతం లేకుండా పూర్తి పారదర్శకతతో పని చేస్తున్నామని తెలిపారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో హ్యాట్రిక్ విజయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు..ఈ సమావేశంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, మండల అధ్యక్షులు ఈర్ల రాజు, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, అయ్యా వార్డుల కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.