వివేకానందున్నీ ఆదర్శంగా తీసుకోవాలి – గజ్జల యోగానంద్

Hyderabad politics Telangana

మనవార్తలు, శేరిలింగంపల్లి :

నేటి యువత స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలని గజ్జెలు యోగానంద్ పిలుపునిచ్చారు.స్వామి వివేకానందులంటే ఒక చైతన్యస్ఫూర్తి. ఒకప్పుడు మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహావీరులెందరికో ఆయన ఆదర్శమని, నేటి రోజుల్లో లక్ష్యం కోసం శ్రమించే యువతరం గుండెల్లో ఆయన నిత్యం రగిలే జ్వాల అని తెలిపారు. ఎప్పుడో సుమారు 130 ఏళ్ల కిందట అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో వివేకానందులు చేసిన ప్రసంగం ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉందన్నారు.

అందుకే వివేకానందుని జయంతిని మన జాతీయ యువదినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. బుధవారం రోజు ఆ మహనీయుని 160వ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి, చందానగర్‌, మైత్రీ నగర్ జంక్షన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శేరిలింగంపల్లి బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ అమెరికాలో సర్వమత సమ్మేళనానికి ముందు వివేకానందులు అక్కడ అనేక రోజులు తిండి, నిద్ర లేకుండా రైలు పెట్టెలో గడిపి అనేక కష్టాలు పడ్డారని, అయితే, సర్వమత సమ్మేళనం తర్వాత వారి గొప్పదనాన్ని ప్రపంచమంతా గుర్తించిందని నాటి విశేషాలను తెలియజేశారు. వివేకానందుల బోధనలన్నీ ప్రాక్టికల్‌గా నేటికి కూడా ఆచరించదగినవేనని పేర్కొన్నారు.

 

సమస్యలు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి స్వామి వివేకానందుల చరిత్రను చదువుకోవాలని పిలుపునిచ్చారు. గమ్యం చేరుకునే వరకూ నిద్రపోవద్దని విజయంతో విర్రవీగవద్దని , అపజయానికి కుంగిపోవద్దని వివేకానందులు చెప్పిన సూక్తులను యోగానంద్ స్మరించుకున్నారు.స్వామి వివేకానంద 1893వ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో పర్యటించిన విషయాన్ని కూడా యోగానంద్ తమ ప్రసంగంలో గుర్తు చేశారు.

సికింద్రాబాదులోని మెహబూబియా కాలేజీలో మిషన్ టు ది వెస్ట్ అనే అంశంపై ఫిబ్రవరి 13న ప్రసంగించారని, ఆ రోజును వివేకానంద డేగా ప్రకటించాలని వివేకానందుల భక్తులు, రామకృష్ణ మఠంవారు కోరుకుంటున్నందున, ఆ కోరిక నెరవేరాలని మనమూ ఆకాంక్షిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పోరెడ్డి బుచ్చి రెడ్డి, అసెంబ్లీ, రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *