పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్
తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
కండ్లకు నల్ల రిబ్బను కట్టుకొని వినూత్న నిరసన
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ వాటర్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడ లో గల బిస్లరీ వాటర్ పరిశ్రమ ముందు కార్మికులు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్నంగా నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ కార్మికులు యూనియన్ పెట్టుకుంటే తొలగించడం చట్టానికి వ్యతిరేకమన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కార్మికులను సైతం యాజమాన్యం భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపించారు. కోట్ల రూపాయలు లాభాలు గడిస్తున్న యాజమాన్యం కు కార్మికులు యూనియన్ పెట్టుకుంటే ఏం ఇబ్బంది ఉందని ఆయన ప్రశ్నించారు. కార్మికుల శ్రమతో యాజమాన్యం కోట్లు గడిస్తు, కార్మికుల భద్రత సంక్షేమం గాలికి వదిలేయడం దారుణమన్నారు.కార్మికులు హక్కులు రక్షణ కోసం కార్మికులు ఏకం కావడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఇప్పటికైనా యజమాన్యం దిగివచ్చి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవడంతోపాటు సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని లేని పక్షంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా యజమాన్యాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి,గౌరవ అధ్యక్షులు నాగరాజు, కోశాధికారి నవీన్, సిఐటియు నాయకులు రాజు,వెంకటేష్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
