ఖచ్చితమైన వాతావరణ అంచనాలకు సమిష్టి కృషి అవసరం

Telangana

_గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ తల్లాప్రగడ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఖచ్చితమైన వాతావరణ అంచనాలకు అన్ని విభాగాల నుంచి సమిష్టి కృషి అవసరమని అమెరికాలోని పర్యావరణ మోడలింగ్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ తల్లాప్రగడ స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘వాతావరణం, వాతావరణం యొక్క సంఖ్యాపరమైన అందనాలో పురోగతి: సవాళ్లు-అవకాశాలు’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన అతిథ్య ఉపన్యాసంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖచ్చితమైన వాతావరణ అంచనాల సవాళ్లను పరిష్కరించడానికి భావితరం శాస్త్రవేత్తలకు శిక్షణ ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ విజయ్ నొక్కి చెప్పారు. వాతావరణ అంచనా నమూనాల భాగాలు, వేగం, ఖచ్చితత్వం ముధ్య ఉన్న వ్యత్యాసాలు, విపత్తు నిర్వహణలో సంఖ్యాపరమైన అందనాల పాత్ర గురించి ఆయన చర్చించారు. తుఫాను విశ్లేషణ, ముందస్తుగా పసిగట్టే వ్యవస్థ (హెచ్ ఏఎఫ్ఎస్), విపత్తు సంసిద్ధత కోసం ఉష్ణమండల తుఫాను అంచనాలను మెరుగుపరచడంలో దాని పాత్రను కూడా ఆయన విశదీకరించారు. పర్యావరణం- గ్రీన్ హౌస్ ప్రభావం గురించి డాక్టర్ విజయ్ ఆందోళన వ్యక్తపరుస్తూ, ఎన్ నివో,లానినా వంటి వాతావరణ మార్పుల ప్రభావాలను వివరించారు. గాలి, సముద్ర ఉష్ణోగ్రతలలో ప్రపంచ సగటు పెరుగుదల, మందు కరిగి సముద్ర మట్టాలు పెరగడం ద్వారా వాతావరణ వ్యవస్థ వేడెక్కడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పలువురు అధ్యాపకులు, విద్యార్థులు సంధించిన ప్రశ్నలకు సవివర జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. తొలుత, భౌతిక శాస్త్ర అధ్యాపకుడు ప్రొఫెసర్ టి. విశ్వం అతిథిని స్వాగతించగా, కార్యక్రము నిర్వాహకుడు. డాక్టర్ ఐ.వీ.సుబ్బారెడ్డి వందన సమర్పణ చేశారు. పలువురు భౌతికశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ విజయ్ ని సత్కరించి, శాలువ, జ్ఞాపికలను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *