ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన గూగుల్ ఇంజనీర్ రోహిత్ కీర్తాంకర్
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సాంకేతిక ఇంటర్వ్యూలలో విజయం సాధించడానికి డేటా నిర్మాణాల పనితీరుపై అవగాహనతో పాటు మౌళిక అంశాలపై పట్టు తప్పనిసరని గూగుల్ ఏడీఎస్ సొల్యూషన్స్ ఇంజనీర్ కీర్తాంకర్ స్పష్టీకరించారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘గూగుల్ స్పీకర్ సెషన్: జాబితా, మ్యాప్, O(1) మ్యాజిక్’ అనే అంశంపై మంగళవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. గీతంలోని గూగుల్ డెవలపర్ గ్రూప్ ఆన్ క్యాంపస్ (జీడీజీసీ) నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోహిత్ పనితీరు ఆధారిత ఇంజనీరింగ్, డేటా నిర్మాణాలపై లోతైన అవగాహన కల్పించారు.

సమయం, స్థల సంక్లిష్టత, సేకరణల ప్రాముఖ్యత, సరైన పనితీరును సాధించడానికి జాబితాలు, మ్యాపులు, సెట్ల ప్రభావవంతమైన ఉపయోగంపై రోహిత్ ప్రధానంగా దృష్టి సారించారు. బిగ్-ఓ సంజ్జామనం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, స్కేలబుల్ అప్లికేషన్లను నిర్మించడానికి మౌళిక అంశాలపై పట్టు సాధించాలన్నారు. ఆచరణాత్మక ఇంటర్వ్యూ వ్యూహాలను పంచుకున్నారు. విద్యార్థులు ప్రాథమిక పరిష్కారాలతో ప్రారంభించి, క్రమంగా వాటిని మెరుగుపరచాలని, తమ ఆలోచనా ప్రక్రియను స్పష్టంగా తెలియజేయాలని ప్రోత్సహించారు. ఇంటర్వ్యూ కోసం సన్నద్ధత, ప్లాట్ ఫామ్ ఆధారిత అభ్యాసం, వైఫల్యాల నుంచి నేర్చుకోవడంపై విద్యార్థులకు రోహిత్ మార్గదర్శనం చేశారు.జీడీజీసీ అధ్యక్షురాలు ఆశ్వికా ఖురానా, అతిథిని పరిచయం చేసి, ఇతర బృంద సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
