పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ సింఘాకు భారత ప్రభుత్వంలోని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (సెర్చ్) పరిశోధనా ప్రాజెక్టును మంజూరు చేసినట్టు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఛత్తీస్ గడ్ లోని రాయ్‌పూర్ జిల్లాలో కృత్రిము మేథ/మెషీన్ లెర్నింగ్ ఆధారంగా భూగర్భ జలాల గుణాత్మక, పరిమాణాత్మక మూల్యాంకనం ప్రాజెక్టును, రూ.32.03 లక్షల గ్రాంట్‌తో సెర్చ్ రీసెర్చ్ గ్రాంట్‌గా 36 నెలల కాల వ్యవధితో మంజూరు చేసినట్టు వివరించారు. భూగర్భ జల వనరుల స్థిరమైన అభివృద్ధి దిశగా భూగర్భ జలాల గుణాత్మక, పరిమాణాత్మక అంచనా కోసం కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించడంలో డాక్టర్ సింఘాకు ఈ రంగంలో ఉన్న నెపుణ్యం, అధునాతన సాంకేతికతలు ఈ పరిశోధనలో తోడ్పడనున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. క్లిష్టమైన పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో ఇటువంటి పరిశోధనల ప్రాముఖ్యతను గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం నొక్కిచెబుతూ, డాక్టర్ సింఘాను అభినందించినట్టు తెలిపారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ. ఎస్. రావు, కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి, వివిధ విభాగాధిపతులు, పలువురు అధ్యాపకులు డాక్టర్ సింఘాకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారన్నారు.