గీతం పూర్వ విద్యార్థికి అరుదైన గౌరవం

Telangana

ప్రపంచ సదస్సులో వక్తగా, న్యాయనిర్ణేతగా పాల్గొనే అవకాశం – గ్లోబల్ ఐకాన్ అవార్డుతో సత్కారం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి, ప్రస్తుతం అమెజాన్ రోబోటిక్స్ లో సిస్టమ్స్ డెవలప్ మెంట్ ఇంజనీర్-2గా పనిచేస్తున్న అనూజ్ సురావ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈనెల 6 నుంచి 12వ తేదీ వరకు అమెరికా, కేంబ్రిడ్జ్ లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ పరిశోధనా సదస్సు (గ్లోబల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్-2024)లో వక్తగా, న్యాయనిర్ణేతగా పాల్గొనడంతో పాటు ‘గ్లోబల్ ఐకాన్ అవార్డు’తో సత్కారం పొందారు.బెంగళూరుకు చెందిన గ్లోబల్ ఎకనామిక్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ హరికృష్ణ మారం నేతృత్వంలో జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేథ రంగాలకు అనూజ్ చేసిన సేవలను గుర్తిస్తూ ‘గ్లోబల్ ఐకాన్ అవార్డు’తో సత్కరించారు. అమెరికా అంకుర సంస్థల నిపుణుడు, వక్త, మార్గదర్శి, వ్యవస్థాపకుడు బారన్ అలెక్ స్టెరన్ చేతుల మీదుగా ఈ సత్కారాన్ని అందుకోవడం విశేషం. ‘అడాప్టివ్ ఇంటర్ ఫేస్ తో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, కృత్రిమ మేథ ఆధారిత ఆటోమేటెడ్ రోబోటిక్ సిస్టమ్’ఫై అనూజ్ సంచలనాత్మక పరిశోధనా పత్రం సమర్పించారు. అంతేగాక తన పరిశోధనాంశాలను అక్కడ ప్రదర్శించడమే గాక, వినూత్న పరిశోధనా పత్రాల ఎంపికలో న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు.

అత్యాధునిక కృత్రిమ మేథస్సు, అడాప్టివ్ ఇంటర్ ఫేస్ ల ఏకీకరణను ప్రస్ఫుటించేలా అనూజ్ అధునాతన రోబోటిక్ సిస్టమ్ లను చూసేందుకు సదస్సుకు హాజరైన వారికి వీలుకల్పించారు. సంకల్ప్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సామాజిక సేవ, అనాథలను ఆదుకోవడమే గాక, గీతం విద్యార్థిగా ప్రఖ్యాత ఐటీసీ సంస్థ నుంచి పర్యావరణ పరిరక్షణకు గాను నేషనల్ గ్రీన్ లీడర్ అవార్డును అనూజ్ అందుకున్నారు. ఆ తరువాత న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ చేసి, అమెరికాలోనే స్థిరపడ్డారు.ప్రతిష్టాత్మక కార్యక్రమంలో గుర్తింపు తెచ్చుకున్న అనూజ్ గీతంలోని ఉన్నత విద్య, విలువల నాణ్యతకు నిదర్శనంగా నిలిచారనడంలో అతిశయోక్తి లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *